మెగాస్టార్ జయించారు! జాతీయ సినిమా రూపమే మారింది!!
ఆయన త్రోబ్యాక్ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
110 సంవత్సరాల భారతీయ సినిమా ప్రస్థానంలో 90 ఏళ్లు పైబడిన చరిత్ర టాలీవుడ్ కి ఉంది. ఇందులో లెజెండరీ హీరోలకు కొదవేమీ లేదు. ఎన్టీఆర్ -ఏఎన్నార్- కృష్ణ- శోభన్ బాబు- చిరంజీవి ఇలా దిగ్గజ హీరోలు మనకు ఉన్నారు. దశాబ్ధాల పాటు కెరీర్ లో ఎన్నో మరపురాని ప్రదర్శనలు ఇచ్చారు. కానీ వీళ్లలో ఎవరికీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ రాలేదు. కనీసం దిల్లీలో తెలుగు సినిమాకి కనీసం గౌరవం అయినా దక్కలేదు. జాతీయ (భారతీయ) సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే. తెలుగు - తమిళ సినిమాలు.. మలయాళం కన్నడ సినిమాలు ఎప్పటికీ జాతీయ సినిమాలు కాదన్న చిన్న చూపు ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన త్రోబ్యాక్ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
చిరంజీవి 1988లో తన రుద్రవీణ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నప్పుడు ఢిల్లీలో జరిగిన అవమానకరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. నిర్వాహకులు కేవలం హిందీ సినిమానే భారతీయ సినిమాగా ప్రొజెక్ట్ చేశారని, సౌత్ సినిమాలకు, స్టార్లకు సమానమైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు. భాష ప్రాంతం అడ్డంకులను బ్రేక్ చేసినందుకు SS రాజమౌళి ప్రయత్నాన్ని ప్రశంసించారు. భాషా సరిహద్దులను చెరిపేసేంత స్థాయిని రాజమౌళి ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. తన చిత్రం రుద్రవీణను నర్గీస్ దత్ అవార్డుతో సత్కరిస్తున్నప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. అవార్డు ప్రదానోత్సవానికి ఒకరోజు ముందు ప్రభుత్వం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు హై టీ ఏర్పాటు చేసింది. వెన్యూ వద్ద భారతీయ సినిమా చరిత్రను చాటిచెప్పే గోడ పోస్టర్లను పరిశీలనగా చూసానని చిరంజీవి తెలిపారు. పృథ్వీరాజ్ కపూర్ నుండి అమితాబ్ బచ్చన్ వంటి హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖులకు మాత్రమే ఆ గోడపై స్థానం ఉంది. కానీ దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఐకాన్‌లు ఎవరూ అక్కడ లేరు. నేను దక్షిణాది సినిమాల్లో ఎవరో ఒక ప్రముఖుడి ఫోటో చూడాలనే ఆశతో నడుస్తూనే ఉన్నాను. అయితే అందులో జయలలితతో ఎంజీఆర్ ఉన్న స్టిల్, ప్రేమ్ నజీర్ ఫోటో మాత్రమే ఉంది అని చిరంజీవి అన్నారు.
టాలీవుడ్ లెజెండరీ హీరోలు ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఫోటోలు కనీస మాత్రంగ కనిపించలేదు.
రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజాలు కానీ తెలుగు పరిశ్రమలోని దిగ్గజ సినీ నిర్మాతలు కానీ గుర్తింపు పొందలేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో నేను చాలా అవమానంగా భావించాను.. అని ఆయన గుర్తు చేసుకున్నారు. హిందీ సినిమాను భారతీయ సినిమాగా చిత్రీకరిస్తున్నారని ఇతర చిత్రాలను `ప్రాంతీయ చిత్రాలు`గా వర్గీకరించారని వాటికి గౌరవం ఇవ్వలేదని మెగాస్టార్ అన్నారు.
ఇటీవల బాహుబలి, RRR, పుష్ప, KGF చాప్టర్ 2 (కన్నడం) వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాయని చిరంజీవి వ్యాఖ్యానించాపారు. ప్రాంతీయ - హిందీ సినిమాల మధ్య దూరాన్ని తొలగించడంలో బాహుబలి కీలక పాత్ర పోషించిందని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అందరూ భాగమేనని నిరూపించినందున బాహుబలి తనను గర్వించేలా చేసిందని మెగాస్టార్ అన్నారు. తెలుగు పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ సాధించిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును చిరు కొనియాడారు.
ఇదీ మారిన సీన్:
ఆసక్తికర పరిణామం ఏమిటంటే.. మెగాస్టార్ ఈ వ్యాఖ్యలు చేసిన ఏడాది కాలంలోనే హిందీ చిత్రసీమ మత్తు ఇటీవల దిగిపోయింది. మెగాస్టార్ జయించారు! చివరికి జాతీయ సినిమా రూపమే మారిపోయింది!! ఇటీవల తెలుగు -తమిళం-మలయాళ పరిశ్రమల నుంచి స్టార్లను కలుపుకుని భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటించాలని హిందీ స్టార్లు ఉవ్విళ్లూరుతున్నారు. సౌత్ స్టార్ల కలయికలో అద్భుతాలు సృష్ఠించగలమని నమ్ముతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న ప్రతి అగ్ర హీరో కనీసం ఇద్దరు ముగ్గురు సౌత్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇక తెలుగు పరిశ్రమ నుంచి అగ్ర హీరోలకు క్రేజీ ఫ్రాంఛైజీ చిత్రాల్లో అవకాశాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ లోనే ధూమ్ 4లో సౌత్ పెద్ద స్టార్లు నటిస్తారని గుసగుసలు ఉన్నాయి. ఖాన్ ల త్రయం తమ సినిమాల్లో సౌత్ స్టార్లకు పెద్ద పాత్రలను ఆఫర్ చేస్తూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ అయితే ఇటీవల ఓ ఈవెంట్లో పుష్ప పాత్రకు నేను సరిపోను.. అల్లు అర్జున్ సర్ పుష్ప పాత్రను ఆక్రమించేసారు! అంటూ ఎంతో గౌరవంగా ప్రస్థావించారు. నిజానికి ఈ పరిణామం చాలా గొప్పది. ఇటీవల లోకల్ సినిమా జాతీయ సినిమా అనే భావనను కూడా తొలగించే ప్రయత్నం జరుగుతోంది. దేశంలో ఏ పరిశ్రమ నుంచి వచ్చినా అది భారతీయ సినిమా అని పిలిచేందుకు అందరూ ఉత్సాహంగా ఉన్నారు.