ఈ హోదాకు ముందు ఎన్ని సవాళ్లు విమర్శలు!

పాపులర్ సెలబ్రిటీలతో ది హాలీవుడ్ రిపోర్టర్ (ఇండియా) మ్యాగజైన్ కవర్ షూట్లు నిరంతరం ప్రజల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి ముఖచిత్రం మరింత ఆకర్షణీయంగా మారింది. దానికి కారణం ఈ కవర్ పేజీపై నయనతార, ఆలియా భట్ లాంటి ప్రతిభావంతులైన, అందమైన తారలు కొలువు దీరడం ఒక వైపు.. జోయా అక్తర్ లాంటి పనితనం ఉన్న ఫిలింమేకర్ మరోవైపు.. నేటితరంలో 1000 కోట్ల క్లబ్ సినిమా తీయగలమని నిరూపించిన స్వప్నాదత్- ప్రియాంక దత్ వేరొకవైపు దర్శనమివ్వడమే.
ఇప్పటికే నిరూపించిన నయన్, ఆలియా, జోయా గురించి చెప్పుకునేదేమీ లేదు. ఈ కవర్ పేజీపై ప్రత్యేకత ఏదైనా ఉంది అంటే అది కచ్ఛితంగా యువ ప్రతిభావనులు, ఫిలింమేకింగ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న దత్ వారసురాళ్ల గురించే ఎంతైనా చెప్పుకుని తీరాలి. 2024లో కల్కి 2898 ఏడి లాంటి పాన్ ఇండియన్ హిట్ తీసిన నిర్మాతలుగా ప్రియాంక, స్వప్న దత్ పేర్లు మార్మోగాయి. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి ఈ పరివారమంతా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు.
అయితే కల్కి లాంటి భారీ విజయం అందించక ముందు స్వప్నదత్- ప్రియాంక దత్ ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వనిదత్ కుమార్తెలు సినీరంగంలో నిర్మాతలుగా స్థిరపడాలని చేసిన ప్రయత్నానికి ఆరంభం చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. వారు ఆరంభం ఫ్లాపులను ఎదుర్కోవడమే కాదు.. విమర్శకుల నుంచి ప్రతికూలతను కూడా ఎదుర్కొన్నారు. వారి సినిమాలు ఫ్లాపులైన క్రమంలో అన్ని వేళ్లు తమవైపే చూపించేవి. తీవ్రమైన వ్యాఖ్యలతో వారిని దూషించిన వారు లేకపోలేదు. కానీ అన్నిటినీ అధిగమించి రొటీన్ సినిమాలతో కాకుండా, కమర్షియల్ మార్గాన్ని ఎంచుకోకుండా ఈ సిస్టర్స్ విజయాలను అందుకున్నారు. మహానటి ఘనవిజయంతో దత్ వారసురాళ్ల పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఎవడే సుబ్రమణ్యం లాంటి హిట్ సినిమాని తీసారు. కానీ కొన్ని వరస పరాజయాలు కెరీర్ లో ఉన్నాయి.
తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీ కోసం ఇంటర్వ్యూలో స్వప్నదత్- ప్రియాంక దత్ ఆసక్తికర విషయాలను మాట్లాడారు. అసలు వారి విజయం వెనక అసలు రహస్యాన్ని బయట పెట్టారు. ``మేము రియలైజ్ అయ్యాం.. మా హృదయం ఏది కోరుతుందో అలాంటి సినిమా తీయాలనుకున్నాం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా, మా మనసుకు నచ్చిన ఇష్టపడిన సినిమాలు తీయడం మొదలు పెట్టాక .. అది మా కెరీర్ దశ దిశను మార్చిందని స్వప్నదత్ అన్నారు. మాకు ఏది నచ్చదో అది చేయడం మానేశాకే మెరుగయ్యామని కూడా అన్నారు.