సల్మాన్ హత్య కోసం AK 47 కాదు.. జిగానా పిస్టల్..!
నిన్నటికి నిన్న సల్మాన్ ని చంపేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పాకిస్తాన్‌కు ఏకే 47 ఆర్డర్ చేసిందని మీడియాలో కథనాలొచ్చాయి.
ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ని ఎలాంటి తుపాకీ(వెపన్)తో కాల్చి చంపాలి? ఎన్ని రౌండ్లు కాల్చి చంపాలి? రెక్కీ ఎలా చేయాలి? ఇలాంటి తర్జనభర్జనలో జోధ్ పూర్ గ్యాంగ్ స్టర్స్ అలసిపోయారని తాజా పరిణామం చెబుతోంది. నిన్నటికి నిన్న సల్మాన్ ని చంపేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పాకిస్తాన్‌కు ఏకే 47 ఆర్డర్ చేసిందని మీడియాలో కథనాలొచ్చాయి. ఇంతలోనే ఇప్పుడు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసెవాలా హత్యలో ఉపయోగించిన టర్కీ దేశ బ్రాండెడ్ వెపన్ `జిగానా పిస్టల్`తో సల్మాన్ ఖాన్‌ను చంపాలని బిష్ణోయ్ ముఠా ప్రణాళికలు సిద్ధం చేసిందని నవీ ముంబై పోలీసులు చెబుతున్నట్టు ప్రఖ్యాత ఏ.ఎన్.ఐ తాజాగా కథనం ప్రచురించింది.
ANI తాజా కథనం ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ అతడి ముఠా పన్వెల్ ఫామ్‌హౌస్ సమీపంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై దాడిని ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ కి కెందిన సరఫరాదారు నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. నవీ ముంబై పోలీసులు ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ చేపట్టారు. తాజా సమాచారం మేరకు.. సిద్ధూ మూసెవాలా హత్యలో ఉపయోగించిన అదే ఆయుధంతో సల్మాన్ ను చంపడానికి బిష్ణోయ్ ముఠా సిద్ధమవుతున్నట్లు పోలీసులు వార్తా సంస్థకు సమాచారం ఇచ్చారు. టర్కీలో తయారు చేసిన జిగానా పిస్టల్‌ను ఉపయోగించి సల్మాన్ పై దాడి చేయమని బిష్ణోయ్ ఆదేశించారని తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి.
పన్వెల్ లో నటుడు సల్మాన్ ఖాన్ కారుపై దాడి చేయాలని అనుకున్నందున నవీ ముంబై పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి నలుగురిని అరెస్టు చేశారు. వీరంతా పాకిస్తాన్ ఆయుధాల సరఫరాదారు నుండి ఆయుధాలను అందుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసారు. లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్ సహా 17 మందిపై కేసులు నమోదయ్యాయి.
శుభ్ దీప్ సింగ్ సిద్ధూగా జన్మించిన సిద్ధూ మూసెవాలా 2022 మే 29 న మాన్సా జిల్లాలో తన జీపును నడుపుతూ వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పుల్లో మరణించాడు. అతడిపై 30 రౌండ్ల బుల్లెట్లను కాల్చారు. పోలీసుల అభిప్రాయం ప్రకారం.. ఈ హత్య ఒక ఇంటర్-గ్యాంగ్ శత్రుత్వ ఫలితంగా జరిగింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు గోల్డీ బ్రార్ ఈ దాడికి బాధ్యత వహించాడు.
ఏప్రిల్ 14 న ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల ఐదు రౌండ్ల పాటు బుల్లెట్లను కాల్చారు. ఈ సంఘటన అనంతరం సల్మాన్ ఖాన్ కు అతడి కుటుంబానికి ముంబై పోలీసులు భద్రతను పెంచారు.