ది ఆర్చీస్ ట్రైలర్: పది మంది బార్బీలు ఒకే చోట చేరినట్టు..!
లైఫ్ లో ఏదైనా సాధించాలి అని తపనపడే స్కూల్ కిడ్స్ చివరికి తమ జీవితాల్లో ఏం సాధించారన్నది ఆర్చీస్ థీమ్.
జాతీయ అవార్డ్ ని గెలుచుకున్న గల్లీబోయ్ చిత్రాన్ని తెరకెక్కించిన జోయా అక్తర్ బాలీవుడ్ లో నటవారసులను పరిచయం చేస్తూ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ది ఆర్చీస్' త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మోస్ట్ అవైటెడ్ 'ది ఆర్చీస్'పై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు ట్రైలర్ రానే వచ్చింది.
నిజానికి ఈ సిరీస్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. ఇది డిసెంబర్ 7న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు పాటలను రివీల్ చేశారు. ఈ సిరీస్ లోని తారాగణం - అగస్త్య నందా, ఖుషీ కపూర్, సుహానా ఖాన్, డాట్, మిహిర్ అహుజా, వేదంగ్ రైనా - యువరాజ్ మెండా తదితరులు నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన ట్రయిలర్ లో పాత్రల పరిచయం ఆకట్టుకుంది. సుందరమైన, కాల్పనిక నగరం రివర్‌డేల్ లో కథ ప్రారంభమవుతుంది. నవతరం తారలతో పాటు, వినయ్ పాఠక్, అలీ ఖాన్ తదితర నటీనటులను చూపించారు. లైఫ్ లో ఏదైనా సాధించాలి అని తపనపడే స్కూల్ కిడ్స్ చివరికి తమ జీవితాల్లో ఏం సాధించారన్నది ఆర్చీస్ థీమ్. వారికి అత్యంత ఇష్టమైన పార్కును మాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, దానిని రక్షించడానికి ప్రయత్నిస్తూ సుహానా- ఖుషీ బృందం దృష్టిని ఆకర్షిస్తుంది. నటీనటులంతా రెట్రో-స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. నటన పరంగా సుహానా, ఖుషీ ఎంతో పర్ఫెక్షన్ తో కనిపించారు. అలాగే అగస్త్య నందా లుక్ ఈజ్ ఆకట్టుకుంది. నిజానికి ఈ చిత్రంలో అందరూ తొలిసారిగా నటిస్తున్నందున ఇది ఒక ఘనత అనే అనుకోవాలి. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా వెరోనికాగా షో స్టాపర్ గా నిలిచింది. సుహానా లుక్ డైలాగ్స్ చూస్తుంటే తనని మరో బార్బీలా దర్శకురాలు ప్రెజెంట్ చేసారని అర్థమవుతోంది. ఖుషీ కపూర్ లుక్స్ , నటన అనుకున్నదానికంటే ఉత్తమంగా ఉందని చెప్పాలి. నిజానికి ఇది బార్బీ బొమ్మల కొలువులా ఉంది అంటే అతిశయోక్తి కాదు.
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతున్న ఈ సిరీస్ ఏకకాలంలో 150 కంటే ఎక్కువ దేశాలలో ప్రేక్షకులకు చేరుకుంటుంది. పాతిక వయసు లోపు స్కూల్ కాలేజ్ పిల్లలను టార్గెట్ చేసి ఈ సిరీస్ ని జోయా రూపొందించారని అర్థమవుతోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012) - జానే తు యా జానే నా (2008) చిత్రాలు యువ విద్యార్థుల గురించిన కథలతో రూపొందాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అదే తరహాలో ది ఆర్చీస్ విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
వెస్ట్రన్ వెదర్ ఇబ్బంది:
అయితే ది ఆర్చీస్ కి ఉత్తరాదిన ఆదరణ ఎలా ఉంటుంది? అన్నది అటుంచితే దక్షిణాదిన ఇలాంటి పాశ్చాత్య వాతావరణాన్ని ఎవరు ఇష్టపడతారు? అన్నది ప్రశ్నార్థకం. సిరీస్ లోని పాత్రల వేషధారణ, ఆహార్యం, బాడీలాంగ్వేజ్ తీరుతెన్నులు, యాంబియెన్స్ సహా ప్రతిదీ మనది కానిదిగా కనిపిస్తున్నాయి. అల్ట్రా రిచ్ కిడ్స్ ని రిలేట్ అవుతూ భారతదేశంలోని స్కూల్ కిడ్స్ దీనిని ఆస్వాధిస్తారా? అన్నది సందిగ్ధం.