అంతమంచి రైటర్, డైరెక్టర్ ఏమైపోయాడు?
గత ఐదేళ్ళ నుంచి ఇతని పేరు ఇండస్ట్రీలో పెద్దగా వినిపించడం లేదు.
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన చాలా మంది రైటర్స్ ఒక్కసారిగా కనుమరుగైపోయారు. ప్రస్తుతం దర్శకులు రచయితల అవసరం లేకుండానే స్క్రిప్ట్ సొంతంగా సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో సీనియర్ రైటర్స్ సైతం డైరెక్టర్స్ గా మారక తప్పడం లేదు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా క్రేజ్ అందుకున్న రైటర్ కమ్ దర్శకుల్లో వీరుపోట్ల ఒకరు. గత ఐదేళ్ళ నుంచి ఇతని పేరు ఇండస్ట్రీలో పెద్దగా వినిపించడం లేదు.
వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా! వంటి మంచి హిట్ కథలను అందించిన ఈ రైటర్ చాలా సినిమాలకు ఘోస్ట్ రైటర్ కూడా వర్క్ చేశాడు. బిందాస్ సినిమాతో దర్శకుడిగా మారి మొదట్లోనే సక్సెస్ చూశాడు. ఆ తరువాత నాగార్జునతో రగడ సినిమా చేశాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు. కానీ మాస్ డైరెక్టర్ గా వీరుపోట్ల రచనకు ప్రశంసలు దక్కాయి. అనంతరం 2013లో మంచు విష్ణుతో చేసిన దూసుకెళ్తా సినిమాతో మరో కమర్షియల్ హిట్ చూశాడు.
అప్పటి వరకు ఒక మాదిరిగా కొనసాగుతున్న అతని కెరీర్ కు సునీల్ తో చేసిన ఒక సినిమాతో బ్రేకులు పడ్డాయి. క్లోజ్ ఫ్రెండ్ అయిన సునీల్ కోసం వీరుపోట్ల ఈడు గోల్డ్ ఎహే(2016).. అనే సినిమా చేశాడు. ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అనంతరం వీరుపోట్లకు సరైన ఛాన్సులు దక్కలేదు. మధ్యలో వరుణ్ గేజ్, గోపిచంద్, మంచు విష్ణు లాంటి హీరోలతో మళ్ళీ కథా చర్చలు జరిపినా సెట్టవ్వలేదు. ఏదేమైనా వర్షం, 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా!' లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. డైరెక్టర్స్ మేకింగ్ తో పాటు వీరు పోట్ల రచన ఆ సినిమాలకి మేజర్ ప్లస్ పాయింట్. అలాంటి రైటర్ మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేస్తే అవకాశాలు రాకుండా ఉండవు. మరి వీరు ఓటీటీ వైపు అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడేమో చూడాలి.