త్రీక్వెల్ ట్రెండ్: ట్రయాలజీగా క్రేజీ మూవీస్!

ఇటీవల కాలంలో అనేక బాలీవుడ్, సౌత్ సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఫ్రాంచైజీ సినిమాలకు విపరీతమైన ప్రజాదరణ దక్కడంతో, కొన్ని క్రేజీ చిత్రాలను ట్రయాలజీగా ప్లాన్ చేస్తున్నారు.

Update: 2024-12-12 00:30 GMT

ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇటీవల కాలంలో అనేక బాలీవుడ్, సౌత్ సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఫ్రాంచైజీ సినిమాలకు విపరీతమైన ప్రజాదరణ దక్కడంతో, కొన్ని క్రేజీ చిత్రాలను ట్రయాలజీగా ప్లాన్ చేస్తున్నారు. అంటే సీక్వెల్ కు కొనసాగింపుగా త్రీక్వెల్ సినిమాలు కూడా రాబోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 'భూల్ భూలయ్యా 3' 'సింఘం ఎగైన్' వంటి త్రీక్వెల్ మూవీస్ మంచి విజయం సాధించాయి. 'పుష్ప 2' చిత్రానికి త్రీక్వెల్ ప్రకటించిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ట్రయాలజీ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

'పుష్ప 3: ది ర్యాంపేజ్'

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2021లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్ గా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమిది. అత్యంత వేగంగా 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా పార్ట్-3 కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సెకండ్ పార్ట్ లో మూడో భాగానికి లీడ్ ఇస్తూ ఎండ్ చేసారు. ''పుష్ప 3: ది ర్యాంపేజ్‌'' అనే పేరుతో త్రీక్వెల్ మూవీ రూపొందనుంది. కాకపోతే పుష్పరాజ్‌ తిరిగి బిగ్ స్క్రీన్ మీదకు రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది.

'యానిమల్ 3'

టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన హిందీ సినిమా 'యానిమల్'. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం.. గతేడాది చివర్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్ గా 'యానిమల్ పార్క్' అనే మూవీ రానుంది. 2027లో షూటింగ్ ప్రారంభిస్తామని హీరో రణబీర్ ఇటీవలే తెలిపారు. దీన్ని ట్రయాలజీగా మార్చబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ అప్పుడే సందీప్ పూర్తి కథను సిద్ధం చేసుకున్నారని, దీన్ని మూడు భాగాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడని వెల్లడించారు. కానీ ''యానిమల్ 3'' ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు లేవు.

'భారతీయుడు 3'

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో ''ఇండియన్ 3'' (భారతీయుడు 3) తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయింది. అయితే 'భారతీయుడు' సీక్వెల్ గా ఈ ఏడాదిలో వచ్చిన 'భారతీయుడు 2' సినిమా భారీ డిజాస్టర్ గా మారడంతో, పార్ట్-3పై జనాల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం శంకర్ తీస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజైన తర్వాత 'భారతీయుడు 3' పై విడుదలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

'హిట్: ది థర్డ్ కేస్'

శైలేష్ కొలను దర్శకత్వంలో HIT ఫ్రాంచైజీలో మూడో సినిమా తెరకెక్కుతోంది. నేచురల్ స్టార్ నాని స్వీయ నిర్మాణంలో ''హిట్ 3: ది థర్డ్ కేస్'' అనే టైటిల్ తో ఈ క్రైమ్ థ్రిల్లర్ రానుంది. ఇందులో అర్జున్ సర్కార్‌ పోలీసాఫీసర్ పాత్రలో నాని కనిపించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది. 'హిట్: ది ఫస్ట్ కేస్'లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. 'హిట్: ది సెకండ్ కేస్' మూవీలో అడివి శేష్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' ఫ్రాంచైజీలో మూడో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీనికి కొనసాగింపుగా 'టిల్లు క్యూబ్' మూవీ రూపొందించనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 'మా ఊరి పొలిమేర' 'పొలిమేర 3' చిత్రాలు మంచి విజయం సాధించిన తర్వాత, థర్డ్ ప్రాంచైజ్ గా ఇప్పటికే 'పొలిమేర 3' మూవీని ప్రకటించారు. అలానే నిఖిల్ సిద్దార్థ్, చందు మొండేటి కాంబినేషన్ లో 'కార్తికేయ' సినిమాని ట్రయాలజీగా మార్చారు. 'కార్తికేయ 2' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచినా నేపథ్యంలో, 'కార్తికేయ 3' ఉంటుందని మేకర్స్ తెలిపారు.

బాలీవుడ్ లో 'స్త్రీ 2' చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీలో ''స్త్రీ 3'' సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'జాలీ LLB 3' మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ త్రీక్వెల్ వచ్చే ఏడాది ఏప్రిల్ 11న విడుదల కానుంది. 'వెల్‌కమ్' సిరీస్ లో భాగంగా 'వెల్‌కమ్ 3' మూవీ రానుంది. 'వెల్‌కమ్ టు ది జంగిల్' పేరుతో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిషా పటానీ కలిసి నటిస్తున్న చిత్రం వచ్చే సంవత్సరమే రిలీజ్ కానుంది. 2025లో 'హేరా ఫేరి 3' కూడా సెట్స్ మీదకు వెళ్తుందని అక్షయ్ ధృవీకరించారు.

'డాన్' ప్రాంఛైజీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో 'డాన్ 3' మూవీ రూపొందనుంది. అలానే రణబీర్ కపూర్ హీరోగా 'బహ్మాస్త్రం 3' సినిమా చేయనున్నారు. హిందీలో 'రేస్ 3' మూవీ కూడా రానుంది. ఇక యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో KGF ఫ్రాంచైజీలో 'KGF: చాప్టర్ 3' తెరకెక్కనుంది. 'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' సినిమాలు హిట్టైన తర్వాత 'బాహుబలి'ని ప్రాంచైజీగా తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'సలార్' చిత్రాన్ని కూడా ట్రయాలజీగా తీసుకొస్తారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News