సితారకు మరో 'రావిపూడి'లా?
టాలీవుడ్‌లో కొన్ని బ్యానర్లు ఒకే దర్శకుడికి వరుసగా అవకాశాలు కల్పించి, మంచి లాభాలు అందుకుంటున్నారు.
టాలీవుడ్‌లో కొన్ని బ్యానర్లు ఒకే దర్శకుడికి వరుసగా అవకాశాలు కల్పించి, మంచి లాభాలు అందుకుంటున్నారు. దిల్ రాజు తన బ్యానర్‌లో అనిల్ రావిపూడికి వరుసగా సినిమాలు నిర్మించారు అంటే అతని మీద ఎంత నమ్మకమే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు (సహా నిర్మాత), ఎఫ్ 2, ఎఫ్ 3 అన్నీ దిల్ రాజు బ్యానర్‌లోనే వచ్చాయి. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అయితే 100 కోట్లకు పైగా లాభాల్ని తెచ్చింది.
ఇక ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కూడా అదే తరహాలో యువ దర్శకులతో పైసా వసూల్ సినిమాలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ కళ్యాణ్, రావిపూడి తరహాలోనే క్లిక్కయ్యేలా ఉన్నాడు అనిపిస్తుంది. మ్యాడ్ తో అతనికి బయట ఆఫర్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా సితార నుంచి బయటకు వెళ్ళలేదు.
అసలైతే కళ్యాణ్ శంకర్ మొదట నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో అనగనగా ఒక రాజు అనే సినిమా చేయాల్సి ఉండగా, కొన్ని విభేదాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ఎలాంటి వెనుకడుగు వేయకుండా, తనదైన కామెడీ టచ్‌తో మ్యాడ్ సినిమాను తెరకెక్కించాడు. అతి తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఆ సినిమా యువతను బాగా ఆకట్టుకుని, టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఈ హిట్‌తో మరింత కాన్ఫిడెంట్‌గా ఉన్న కళ్యాణ్ శంకర్, అదే టీమ్‌తో మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించాడు. ఇప్పటికే టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే, నిర్మాత నాగవంశీ కళ్యాణ్ శంకర్‌తో మరో ప్రాజెక్ట్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇది చిన్న విషయమేమీ కాదు.
ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ టిల్లు క్యూబ్, అంటే టిల్లు ఫ్రాంచైజీకి కొనసాగింపు. ఇప్పటికే DJ టిల్లు, టిల్లు స్క్వేర్ సూపర్ హిట్స్ కాగా, ఇప్పుడు టిల్లు క్యూబ్ అనే మూడో భాగాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. సిద్ధు జొన్నలగడ్డ క్రియేటివ్ ఎనర్జీతో నడిచే ఈ ఫ్రాంచైజీకి, కళ్యాణ్ శంకర్ డైరెక్టర్‌గా అనౌన్స్ కావడం చర్చకు దారితీసింది. టిల్లు క్యూబ్ కోసం పెద్ద బడ్జెట్ కేటాయించారని, ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఈ ప్రాజెక్ట్ మీద మంచి హైప్ ఉందని సమాచారం.
ప్రస్తుతం కళ్యాణ్ శంకర్, సిద్ధు జొన్నలగడ్డ కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో నిమగ్నమయ్యారని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. టిల్లు ఫ్రాంచైజీని మరో లెవెల్‌కి తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు కళ్యాణ్ శంకర్ పై పడింది. కామెడీ ఎంటర్‌టైనర్‌లలో తన ప్రత్యేకతను ఇప్పటికే మ్యాడ్ తో నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు టిల్లు క్యూబ్ కి డైరెక్టర్‌గా మరింత పక్కాగా సిద్దమవ్వాలి. ఈ సినిమాతో ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
క్లియర్‌గా చూస్తే దిల్ రాజు అనిల్ రావిపూడి ని సెట్ చేసుకున్న స్టైల్ లో నాగవంశీ, కళ్యాణ్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా విజయాలను అందించిన కళ్యాణ్ శంకర్, టిల్లు క్యూబ్ ని కూడా హిట్ చేస్తే అతని స్థాయి మరో రేంజ్‌కి వెళ్లనుంది. మరి టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న అనిల్ రావిపూడి తరహాలో ఈ యువ దర్శకుడు క్లిక్కవుతాడో లేదో చూడాలి.