టాలీవుడ్@2024: ఈ ఏడాదిలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే!
2024లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం.
2024 చివరికి వచ్చేశాం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సినీ ప్రియులను అలరించడానికి అనేక తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ మూవీస్, చిన్నా చితకా చిత్రాలు అన్నీ కలిపి మొత్తం 239 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఈ నెలాఖరులోపు మరో 9 చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
పేరుకి రెండు వందలకు పైగా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ, వాటిల్లో ఆడియన్స్ ను అలరించిన చిత్రాలు మాత్రం చాలా తక్కువే ఉన్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్ రేట్ చూసుకుంటే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. గట్టిగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సినిమాలు 20 కూడా లేవు. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. 3 రోజుల్లోనే ₹621 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పటికే అనేక రికార్డులు బ్రేక్ చేసింది. ఈ క్రమంలో అత్యంత వేగంగా ₹1000 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. అంతేకాదు ఈ ఏడాది 'కల్కి' హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేసి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా ₹1100 - 1200 కోట్లు వసూలు చేసి, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా టాప్ లో నిలిచింది. కొరటాల డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' పార్ట్-1 సినిమా ₹500 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ వసూళ్లు కేవలం తారక్ స్టార్ పవర్ తోనే సాధ్యమయ్యాయని, సినిమాలో అంత పొటెన్షియ్ ఉన్న కంటెంట్ లేదనే కామెంట్స్ వచ్చాయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన సూపర్ హీరో సినిమా 'హను-మాన్'. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని భారీ విజయాన్ని అందుకుంది. ₹40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ₹301-350 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక అదే పొంగల్ కు విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' మూవీ కూడా హిట్టైంది. మొదటి పది రోజుల్లోనే ₹231 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు కానీ, ఫైనల్ రన్ లో ₹172 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు టాక్.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా 'టిల్లు స్క్వేర్'. ఇది డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్. ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర అనూహ్యంగా ₹135 కోట్లు రాబట్టింది. అదే బ్యానర్ లో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'లక్కీ భాస్కర్' మూవీ కూడా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇది ₹100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమా సైతం వంద కోట్ల క్లబ్ లో చేరింది.
కిరణ్ అబ్బవరం తన స్వీయ నిర్మాణంలో రూపొందించిన సినిమా 'క'. దీపావళికి చిన్న చిత్రంగా వచ్చి, పెద్ద విజయం సాధించింది. దాదాపు ₹53 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'నా సామి రంగా' మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. వరల్డ్ వైడ్ గా₹50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, అన్ని ఏరియాలలోనూ బ్రేక్ ఈవెన్ అయింది. ఇలా పైన చెప్పిన సినిమాలు వరుసగా 2024లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్-10 తెలుగు చిత్రాలుగా నిలిచాయి.
ఇక శ్రీ సింహా, సత్య కలిసి నటించిన 'మత్తు వదలరా 2'.. విశ్వక్ సేన్ 'గామి', సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన', శ్రీ విష్ణు 'ఓం భీమ్ బుష్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే 'కమిటీ కుర్రాళ్ళు', 'ఆయ్', 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్', 'జీబ్రా' లాంటి సినిమాలు కూడా హిట్టయ్యాయి. 'మా నాన్న సూపర్ హీరో' మంచి సినిమా అనిపించుకుంది. 'రాబిన్ హుడ్', 'బచ్చల మల్లి', 'మ్యాజిక్', 'సారంగపాణి జాతకం', 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' లాంటి చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. మరి వాటిల్లో ఏయే సినిమాలు విజయం సాధిస్తాయో చూడాలి.