చిరు, ప్రభాస్, పవన్, రవితేజ Vs రజనీ, కమల్, అజిత్, సూర్య, ధనుష్..!
కానీ వచ్చే 2025 వేసవికి మాత్రం స్టార్ హీరోలు నటిస్తున్న భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
టాలీవుడ్ లో ఈ ఏడాది సమ్మర్ సీజన్ వేస్ట్ అయిపోయింది. వేసవి కాలంలో పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. ఐపీఎల్ క్రికెట్, ఎన్నికలు, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈసారి పెద్ద హీరోలెవరూ థియేటర్లలోకి వచ్చే సాహసం చెయ్యలేదు. దీంతో ఈ సీజన్ ను రెండు మూడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు క్యాష్ చేసుకున్నాయి. కానీ వచ్చే 2025 వేసవికి మాత్రం స్టార్ హీరోలు నటిస్తున్న భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ హార్రర్ కామెడీ మూవీ 'ది రాజాసాబ్' వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' మూవీ మొదటి భాగాన్ని మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఒకవేళ ఈ చిత్రం అనుకున్న సమయానికి రాకపోతే, సుజీత్ డైరెక్షన్ లో జనసేనాని చేస్తున్న OG సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రానికి 'మాస్ జాతర' అనే టైటిల్ పెట్టారు. మే 9వ తారీఖున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు ఈ మధ్యనే ప్రకటించారు. చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో రూపొందుతున్న సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ 'విశ్వంభర'. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసారు. వచ్చే ఏడాది సమ్మర్ కు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మంచి డేట్ కోసం చూస్తున్నారు.
ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది 2025 సమ్మర్ లో బాక్సాఫీస్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. వాటిల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేసే పాన్ ఇండియా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటికి కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. వచ్చే వేసవికి వారానికి ఒకటి చొప్పున అనేక క్రేజీ తమిళ సినిమాలు థియేటర్లలోకి రాడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలుగు చిత్రాలతో బాక్సాఫీస్ క్లాష్ కు వస్తున్నాయి.
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'థగ్ లైఫ్' సినిమాని 2025 జూన్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న Suriya44 చిత్రాన్ని మార్చి నెలాఖరున పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న 'ఇడ్లీ కడాయి' సినిమాని వచ్చే ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
ధనుష్, శేఖర్ కమ్ముల కలయికలో రాబోతున్న త్రిభాషా చిత్రం 'కుబేర' శివరాత్రికి వస్తుందని టాక్. ఒకవేళ ఈ సీజన్ మిస్సయితే ఈ సినిమా సమ్మర్ కు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలిసి చేస్తున్న 'కూలీ' సినిమాని సైతం వేసవిలోనే విడుదల చెయ్యాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ రెండు మామా అల్లుళ్ల చిత్రాల్లోనూ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అజిత్ కుమార్ నటిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని పొంగల్ కి ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు సమ్మర్‌లో విడుదల చేస్తారనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇది రాకపోయినా 'విదాముయార్చి' సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విధంగా 2025 సమ్మర్ లో టాలీవుడ్ స్టార్స్ కు పోటీగా అనేక తమిళ చిత్రాలు రాబోతున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే సామర్థ్యం ఉన్న సినిమాలే కావడం గమనార్హం. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఫైనల్ గా సమ్మర్ రేసులో ఏయే సినిమాలు నిలుస్తాయో చూడాలి.