ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్ Vs విజయ్, సూర్య, కార్తీ, ధనుష్

కాకపోతే కోలీవుడ్ స్టార్ హీరోలు మన టాలీవుడ్ స్టార్స్ మాదిరిగా పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు. సౌత్ లో సత్తా చాటుతున్నప్పటికీ, నార్త్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు.

Update: 2024-07-31 13:30 GMT

ఇండియా సినిమాలో ప్రస్తుతం సౌత్ హీరోల డామినేషన్ నడుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు పాన్ ఇండియా మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దక్షిణాది హీరోలంతా మల్టీ లాంగ్వేజ్ సినిమాల్లో నటిస్తూ, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సొంత భాషల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మార్కెట్ ను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలుగు, తమిళ హీరోల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది.

టాలీవుడ్ లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్నారు. సీనియర్ హీరోలను పక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళకే ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉంది. వీరి సినిమాలు తెలుగులోనే కాదు.. తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతున్నాయి. మన హీరోల దెబ్బకు అక్కడి స్టార్ హీరోల సినిమాల రిలీజులు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ప్రభాస్ నేరుగా బాలీవుడ్ లో అడుగుపెట్టగా.. తారక్ త్వరలోనే హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనున్నారు. బన్నీ, చెర్రీ కూడా హిందీ ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతున్నారు.

మరోవైపు కోలీవుడ్ లో విజయ్, సూర్య, కార్తీ, ధనుష్ లాంటి తమిళ హీరోలకు ఇతర ఇండస్ట్రీలలోనూ మంచి క్రేజ్ ఉంది. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి సీనియర్ కథానాయకులను మినహాయిస్తే.. ఇప్పుడు ఈ స్టార్స్ కు మాత్రమే పక్క రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా వీరికి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. మన అగ్ర నిర్మాతలు సైతం అధిక పారితోషికం ఇచ్చి, వారితో మూవీస్ తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు తమిళ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించారు. ఇక వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే, మన రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కువ థియేటర్స్ దొరికే పరిస్థితి ఉంది.

కాకపోతే కోలీవుడ్ స్టార్ హీరోలు మన టాలీవుడ్ స్టార్స్ మాదిరిగా పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు. సౌత్ లో సత్తా చాటుతున్నప్పటికీ, నార్త్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. అందుకే ఎన్ని హిట్లు కొట్టినా 'పాన్ ఇండియా స్టార్స్' అనిపించుకోలేకపోతున్నారు. తెలుగు హీరోలు ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల క్లబ్ లో చేరారు కానీ, తమిళ హీరోలు ఇంకా ఆ మార్క్ ను చేరుకోలేకపోతున్నారు. రాబోయే సినిమాతో కచ్చితంగా మైల్ స్టోన్ మార్క్ ను అందుకుంటారని తమిళ తంబీలు భావిస్తున్నారు.

విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'కంగువ' చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కాబోతోంది. 'రాయన్' సినిమాతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ధనుష్.. 'కుబేర' అనే త్రిభాషా చిత్రంలో నటిస్తున్నారు. కార్తీ 'మెయ్యజగన్', 'వా వాతియారే' వంటి సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు.

తెలుగు హీరోల విషయానికొస్తే, ఇటీవల 'కల్కి 2898 AD' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ప్రభాస్.. 'ది రాజా సాబ్' సినిమాలో నటిస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ పెట్టారు. ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర 1' మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' మూవీతో డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ లో థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News