టాలీవుడ్ హీరోల ఆస్తులు అంత ఉంటాయా?

అయితే సీనియ‌ర్ స్టార్లు ద‌శాబ్ధాల పాటు టాలీవుడ్ లో చ‌క్రం తిప్పారు. వారిలో ఎవ‌రి ఆస్తి ఎంత‌? అంటే.. సుమారు అంచ‌నా వెలువ‌డింది.

Update: 2023-10-18 08:30 GMT

తెలుగు సినిమా నాలుగు పిల్ల‌ర్స్ గా మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, అక్కినేని నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్ పేర్లు వినిపిస్తుంటాయి. ఆ న‌లుగురి ఆస్తులు వేల కోట్లు అంటూ ఇప్పుడు నెటిజ‌నుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నేటి జ‌న‌రేష‌న్ స్టార్లుగా చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, ప్ర‌భాస్, మ‌హేష్ లాంటి స్టార్లు వంద‌ల కోట్ల సంపాద‌న‌ను క‌లిగి ఉన్నారు. అయితే సీనియ‌ర్ స్టార్లు ద‌శాబ్ధాల పాటు టాలీవుడ్ లో చ‌క్రం తిప్పారు. వారిలో ఎవ‌రి ఆస్తి ఎంత‌? అంటే.. సుమారు అంచ‌నా వెలువ‌డింది.


చిరంజీవి కొణిదెల‌:

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో క‌మ‌ర్షియల్ సినిమా రారాజుగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికీ త‌న స‌త్తా ఏంటో చూపిస్తున్నారు. 150 సినిమాల త‌ర్వాతా త‌న‌కు క్రేజ్ ఎంత మాత్రం త‌గ్గ‌లేద‌ని ప్రూవ్ అయింది. ఒక్కో సినిమాకు అత్య‌ధిక ప్యాకేజీ అందుకునే స్టార్ల‌లో ఒక‌రిగా మెగాస్టార్ పేరు ప్ర‌చారంలో ఉంది. ఆయ‌న దాన ధ‌ర్మాలు, సామాజిక సేవ‌ల గురించి జ‌గ‌ద్విదిత‌మే. త‌న సుదీర్ఘ కెరీర్ లో ఆయ‌న సంపాదించిన ఫామ్ హౌస్ లు, సొంత ఇల్లు, ఇండ్ల స్థ‌లాలు, పొలం, ల‌గ్జ‌రీ కార్లు వ‌గైరా వ‌గైరా విలువ‌ను శోధిస్తే..

చిరంజీవి నిక‌ర ఆస్తి సుమారు విలువ‌: 5000 కోట్లు


అక్కినేని నాగార్జున‌:

లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట‌వార‌సుడిగా సినీరంగంలో ప్ర‌వేశించిన కింగ్ నాగార్జున త‌న తండ్రి లెగ‌సీని విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపించారు. ప‌రిశ్ర‌మ నాలుగు మూల స్థంబాల్లో ఆయ‌న ఒక‌రు. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌హా హైద‌రాబాద్ లో భారీ ఆస్తుల‌ను క‌లిగి ఉన్నారు. విదేశాల్లోను జ‌మానా కాలంలో హోట‌ల్స్ రెస్టారెంట్స్ వ్యాపారాల్లో స్థిర‌ప‌డిన నాగార్జున త‌మ వ్యాపారాల్ని విస్త‌రిస్తూనే ఉన్నారు. స్వ‌యంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లోను పూర్తి స్థాయి స్టూడియోల‌ను నిర్మించి నిర్వ‌హిస్తున్నారు. అక్కినేని ఫిలింఇనిస్టిట్యూట్ ఎంతో ఫేమ‌స్. ముఖ్యంగా న‌గ‌రంలో క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ ల్లో పెట్టుబ‌డులు, ఎన్ క‌న్వెన్ష‌న్ లాంటి భారీ ఆదాయ ఆర్జ‌న ఉన్న సంస్థ‌ల్ని క‌లిగి ఉన్నారు. విదేశాల్లోను భారీగా ఆస్తుల‌ను క‌లిగి ఉన్నార‌ని ప్ర‌చారం ఉంది.

నాగార్జున నిక‌ర ఆస్తి సుమారు విలువ‌: 4000 కోట్లు నుంచి 6000 కోట్లు


విక్ట‌రీ వెంక‌టేష్‌:

మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు వార‌సుడిగా సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి అగ్ర హీరోగా ఎదిగారు వెంక‌టేష్. ఫ్యామిలీ ఆడియెన్, మ‌హిళా ప్రేక్ష‌కుల్లో భారీ ఫాలోయింగ్ క‌లిగి ఉన్న స్టార్ ఆయ‌న‌. ప‌రిశ్ర‌మ న‌లుగురు హీరోల్లో భారీ పారితోషికం అందుకునే స్టార్ గా ఆయ‌న‌కు పేరుంది. అయితే వెంక‌టేష్ సోద‌రుడు ద‌గ్గుబాటి సురేష్ బాబు స్టూడియోల నిర్వ‌హ‌ణ స‌హా ఇత‌ర వ్యాపారాల్ని చూస్తుంటారు. వివేకానందుని డివోటీగా వెంకీ ఇత‌ర క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను అంత‌గా ప‌ట్టించుకోర‌ని చెబుతుంటారు. అయితే వార‌స‌త్వ సంప‌ద (స్టూడియోలు, నిర్మాణ సంస్థ, పంపిణీ వ‌గైరా ఉమ్మ‌డి ఆస్తులు)తో పాటు, వెంకీ స్వ‌యంగా ఆర్జించిన ఆస్తుల విలువ‌ను గ‌ణిస్తే...

వెంక‌టేష్ నిక‌ర ఆస్తి సుమారు విలువ‌..నిర్మాత‌ సురేష్ బాబుతో క‌లిపి ఉమ్మ‌డి ఆస్తి విలువ‌: 6000 కోట్లు

(స్టూడియోలు, ఇతర సినీ వ్యాపారాలు అన్నీ క‌లుపుకుని)


నంద‌మూరి బాల‌కృష్ణ‌:

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సినీరాజ‌కీయ రంగంలో సుప్ర‌సిద్ధులు. న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు వార‌సుడిగా సినీరంగంలో ప్ర‌వేశించి ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల్లో ఒక‌రిగా సుస్థిర‌మ‌య్యారు. మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఆయ‌న‌. ఇప్ప‌టికీ సాటి హీరోల‌తో పోటీప‌డుతూ త‌న‌కు తానే పోటీ అని నిరూపిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్నారు. బాల‌య్య‌కు వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తుల‌తో పాటు, ఆయ‌న హీరోగా ఆర్జించిన‌ది అంచ‌నా వేస్తే...

బాల‌కృష్ణ నిక‌ర ఆస్తి సుమారు విలువ‌: 4000 కోట్లు పైమాటే..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్:

ప‌రిశ్ర‌మ అగ్ర‌నిర్మాత‌, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ కుమారుడు అల్లు అర్జున్ స్వ‌యం కృషి, అసాధార‌ణ‌ ఎదుగుద‌ల గురించి తెలిసిందే. ద‌శాబ్ధాల చ‌రిత్ర ఉన్న తెలుగు చిత్ర‌సీమలో ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక క‌థానాయ‌కుడు అల్లు అర్జున్. ప‌రిశ్ర‌మ అగ్ర‌నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిట‌ర్ గా అల్లు అర‌వింద్ అగ్ర‌జుడు. ఇటీవ‌ల స్టూడియోల నిర్మాణం స‌హా `ఆహా తెలుగు` ఓటీటీని విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తున్నారు. ఒక్కో సినిమాకి అల్లు అర్జున్ భారీ ప్యాకేజీలు అందుకుంటున్నారు. బ‌న్ని సోద‌రుడు అల్లు శిరీష్ కూడా హీరోగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అల్లూ ఉమ్మ‌డి ఆస్తుల విలువ‌ను గ‌ణిస్తే..

అల్లు అర్జున్ అత‌డి కుటుంబ‌ నిక‌ర (ఉమ్మ‌డి) ఆస్తుల సుమారు విలువ‌: 5000 కోట్లు

ఇదంతా నెటిజ‌నుల్లో సాగుతున్న స్పెక్యులేటెడ్ చ‌ర్చ మాత్ర‌మే. ఇవ‌న్నీ అంచ‌నా విలువ‌లు. అభిమానుల్లో నిరంత‌రం బిగ్ డిబేట్ కి తెర‌తీసే టాపిక్ కూడా ఇది. ప్ర‌స్తుతానికి ప‌రిశ్ర‌మ మూల స్థంబాల ఆస్తుల గురించి బ‌య‌ట ప్రచారం ఇలా ఉంది. దీనికి ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు.

Tags:    

Similar News