షైన్ సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నాడే
మరికొంత మంది అసలేమాత్రం సౌండ్ చేయకుండా తమ పని తాము చేసుకుంటూ తమ పనితో సత్తా చాటుతూ కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంటారు.;

ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా బిజీగా మార్చేస్తుందో చెప్పలేం. కొంతమంది స్టార్‌డమ్ వచ్చేకొద్దీ అందరి దృష్టిలో పడుతూ, మీడియా ముందుకొస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మరికొంత మంది అసలేమాత్రం సౌండ్ చేయకుండా తమ పని తాము చేసుకుంటూ తమ పనితో సత్తా చాటుతూ కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంటారు.
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇందులో రెండో లిస్ట్ లోకి వస్తాడు. ఆల్రెడీ మలయాళ సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్, నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ మూవీలో విలన్ గా మంచి నటనను కనబరిచి అందరినీ మెప్పించాడు.
దసరా సినిమాలో తన నటనను చూసి ఆయనకు ఆఫర్లు క్యూ కట్టాయి. దసరా తర్వాత రంగబలిలో తనదైన నటనతో ఆకట్టుకున్న షైన్ టామ్, ఆ తర్వాత కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర1లో ఓ ముఖ్య పాత్ర చేశాడు. యాక్షన్ డ్రామాగా వచ్చిన దేవరలో కూడా షైన్ తన పాత్రకు తగ్గ న్యాయం చేకూర్చి అందరి కంట్లో పడ్డాడు.
దేవర తర్వాత బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించాడు షైన్. అయితే ఇప్పటివరకు షైన్ టామ్ చాకో చేసిన సినిమాలు, అందులోని ఆయన పాత్రలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ జానర్లలో ఉన్నవే. ప్రతీ పాత్రలో కొత్తదనం ఉంది. షైన్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ల వల్ల ఆయన ఎలాంటి తరహా పాత్ర అయినా చేయగలడనే నమ్మకం దర్శకనిర్మాతలకు వచ్చేసింది.
అయితే ఇప్పుడు షైన్ టామ్ ఈ వారం రిలీజైన రాబిన్‌హుడ్ సినిమాలో కూడా ముఖ్య పాత్ర చేశాడు. రాబిన్‌హుడ్ లో షైన్ టామ్ విక్టర్ అనే పోలీసాఫీసర్ పాత్రలో నటించాడు. విక్టర్ క్యారెక్టర్ లో షైన్ టామ్ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ఆడియన్స్ ను మెప్పించి మరోసారి టాలీవుడ్ లో తన సత్తా చాటాడు. ఏదేమైనా షైన్ చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుని వెళ్తున్నాడని అతని జర్నీ చూసి చెప్పొచ్చు.