చిన్న సినిమాకి ఒక్క మంచి పాట చాలు

ఈరోజుల్లో చిన్న సినిమాలు జనాల దృష్టిని ఆకర్షించడానికి మంచి ప్రమోషనల్ కంటెంట్ ఎంతో అవసరం

Update: 2024-07-24 17:09 GMT

ఈరోజుల్లో చిన్న సినిమాలు జనాల దృష్టిని ఆకర్షించడానికి మంచి ప్రమోషనల్ కంటెంట్ ఎంతో అవసరం. టీజర్, ట్రైలర్ తో పాటుగా ఒక చార్ట్ బస్టర్ సాంగ్ పడితే ఆటోమేటిక్ గా అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అదే మూవీకి మంచి బిజినెస్ జరిగేలా చూస్తుంది.. అదే ప్రేక్షకులను థియేటర్ల వరకూ రప్పిస్తోంది. ఆ తర్వాత టాక్ బాగుంటే సినిమా థియేటర్లో కొన్నాళ్ళు ఆడుతుంది. అందుకే ఇటీవల కాలంలో చిన్న మీడియం రేంజ్ బడ్జెట్ తో తీసే చిత్రాలకు కాస్త పేరున్న సంగీత దర్శకుడిని పెట్టుకుంటున్నారు. పేమెంట్ కాస్త ఎక్కువైనా సరే, మంచి పాటలు కావాలనే ఉద్దేశ్యంతో నోటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ నే తీసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో పాటలతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా ''ధూం ధాం''. దీనికి మలయాళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఆయన ఇంతకముందు తెలుగులో 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' 'భలే భలే మగాడివోయ్' 'ఊపిరి' 'ప్రేమమ్' 'మజ్ను' 'నిన్ను కోరి' 'గీత గోవిందం' మజిలీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లాంటి ఎన్నో చిత్రాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించారు. ఇప్పుడు 'ధూం ధాం' మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసారు.

ఇప్పటికే 'ధూం ధాం' చిత్రం నుంచి వచ్చిన 'మల్లెపూల టాక్సీ..', 'మాయా సుందరి..' పాటలు సంగీత ప్రియులను అలరించాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్టుగా 'టమాటో బుగ్గల పిల్ల..' అంటూ సాగే థర్డ్ సాంగ్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గోపీ సుందర్ ఈ పాటకు బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు క్యాచీ లిరిక్స్ రాయగా.. గాయనీ గాయకులూ గీతా మాధురి, శ్రీకృష్ణ కలిసి ఆకట్టుకునేలా పాడారు. ఈ డ్యూయెట్ చూడ్డానికి కూడా బాగా కలర్ ఫుల్ గా ఉంది. దీనికి 'నా సామిరంగా' డైరెక్టర్ విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేసారు.

యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా "ధూం ధాం" సినిమా తెరకెక్కుతోంది. ఇందులో 'ఫస్ట్ ర్యాంకర్ రాజు' ఫేమ్ చేతన్ కృష్ణ, అందాల భామ హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా వచ్చిన 'టమాటో బుగ్గల పిల్ల' పాటలో ఈ జోడీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, బెనర్జీ, ప్రవీణ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందించారు. సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ చేస్తున్నారు.

"ధూం ధాం" చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. త్వరలో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరపరిచిన మూడు పాటలు కూడా బాగున్నాయి. రాబోయే రోజుల్లో సినిమాకు బజ్ తీసుకురావడానికి మేకర్స్ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేస్తారో చూడాలి.

Full View
Tags:    

Similar News