ఈ వారం టాప్-5 సినిమాలు ఇవే!
మూవీ టాక్, ఫస్ట్ డే కలెక్షన్స్, బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి ఈ వీకెండ్ టాప్-5 సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
మార్చి నెలాఖరున సినీ అభిమానులను అలరించడానికి సరికొత్త సినిమాలు వచ్చేసాయి. ప్రేక్షకులకు వేసవి వినోదాన్ని పంచడానికి ఈ వారంలో పలు క్రేజీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. గత వారం వచ్చిన చిత్రాల్లో 'ఓం భీమ్ బుష్' మంచి విజయం సాధించగా.. అదే సక్సెస్ ట్రాక్ ను కొనసాగించడానికి శుక్రవారం 'టిల్లు స్క్వేర్' మూవీ రిలీజయింది. 'ది గోట్ లైఫ్ - ఆడుజీవితం' వంటి మలయాళ డబ్బింగ్ సినిమాతో పాటుగా 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్' వంటి హాలీవుడ్ మూవీ కూడా విడుదలయింది. వీటి మధ్యలో 'కలియుగం పట్టణంలో' అనే చిన్న సినిమా.. 'క్రూ' అనే హిందీ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూవీ టాక్, ఫస్ట్ డే కలెక్షన్స్, బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి ఈ వీకెండ్ టాప్-5 సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. టిల్లు స్క్వేర్:
ఈ వారంలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'టిల్లు స్క్వేర్' ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇది రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే రూ. 23 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. డబుల్ ఫన్, డబుల్ మ్యాడ్ నెస్ ను అందిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ఈవారం ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. బుక్ మై షోలో దీనికి 9.2 రేటింగ్ వచ్చింది. ఈరోజు, రేపటికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఈ వారాంతంలో భారీ కలెక్షన్స్ గ్యారంటీ అనిపిస్తోంది.
2. ది గోట్ లైఫ్ - ఆడుజీవితం
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ది గోట్ లైఫ్'. సర్వైవల్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాని 'ఆడు జీవితం' పేరుతో గురువారం మార్చి 28న విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసారు. వాస్తవ ఘటనల ఆధారంగా పూర్తిగా ఎడారిలో తీసిన తొలి భారతీయ సినిమా ఇది. బ్రతుకు తెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన ఓ యువకుడు అక్కడ బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు?ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమాలో ఎంతో ఉద్వేగంగా చూపించారు. డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. బుక్ మై షోలో 9.5 రేటింగ్ వచ్చింది. కంటెంట్ వైస్ చూసుకుంటే ఈ వారంలో ఇదే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కానీ కమర్షియల్ యాంగిల్ లో చూస్తే మాత్రం సెకండ్ ప్లేస్ లో ఉంటుంది.
3. ఓం భీమ్ బుష్:
గత వారం విడుదలైన 'ఓం భీమ్ బుష్' సినిమా, ఈ వీకెండ్ లో మూడో స్థానంలో నిలిచింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్.. అన్ని వర్గాల ప్రేక్షకులని హిలేరియస్ గా నవ్వించింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది.
4. గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్
మాన్‌స్టర్‌వర్స్ ఫ్రాంచైజీలో ఐదవ చిత్రం 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్'. ఇది 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్'కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన ఈ హాలీవుడ్ మూవీ ఇంగ్లిష్‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ మార్చి 29న విడుదల అయింది. ప్రపంచం మీద విరుచుకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. దీనికి ఓ వర్గం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అటు గాడ్జిల్లా, ఇటు కింగ్ కాంగ్ ఒకదానిపై ఒకటి విరుచుకుపడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ ఈ సినిమా పట్ల ఆసక్తిని కనబరుస్తుండటంతో ఈ వారం నాలుగో ప్లేస్ లో ఉంది.
5. క్రూ:
టబు, కరీనా కపూర్ మరియు కృతి సనన్ ఎయిర్ హోస్టెస్‌లుగా ప్రధాన పాత్రల్లో నటించిన హీస్ట్ కామెడీ చిత్రం 'క్రూ'. రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ హిందీ సినిమా మార్చి 29న రిలీజయ్యింది. అయితే ప్రమోషనల్ మెటీరియల్ తో ఆకర్షించిన ఈ సినిమాకి ప్రేక్షుకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. హైదరాబాద్ లోని మల్టీఫ్లెక్స్ లలో చాలా షోలు వేశారు కానీ, బుకింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందుకే ఈ చిత్రం ఈ వారం చివరి స్థానంలో నిలిచింది.