భీముడు మనవడు భూమ్మీదకు వస్తాడా?.. ఇంట్రెస్టింగ్ గా 'బార్బరిక్' టీజర్
''త్రిబాణధారి బార్బరిక్'' చిత్రానికి మోహన్ శ్రీవాత్స దర్శకత్వం వహిస్తున్నాడు. 'ది రాజాసాబ్' డైరెక్టర్ మారుతి ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు
ఇండియన్ సినిమాలో ప్రస్తుతం మైథలాజికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో ఫిలిం మేకర్స్ అందరూ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా రాసుకున్న కాన్సెప్ట్‌తో చిత్రాలను తెరకెక్కించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సమకాలీన కథలతో పౌరాణిక ఇతిహాసాలను బ్లెండ్ చేస్తూ బిగ్ స్క్రీన్ మీద అద్భుతాలు సృష్టిస్తున్నారు. రామాయణ, మహాభారతాల్లోంచి పాత్రలను తీసుకుని గ్రాండ్‌గా సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ''త్రిబాణధారి బార్బరిక్'' అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
''త్రిబాణధారి బార్బరిక్'' చిత్రానికి మోహన్ శ్రీవాత్స దర్శకత్వం వహిస్తున్నాడు. 'ది రాజాసాబ్' డైరెక్టర్ మారుతి ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వానర సెల్యులాయిడ్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా విజయ్‌పాల్ రెడ్డి అదిధాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్, మోషన్ పోస్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. న్యూ ఇయర్ లో మేకర్స్ ఈరోజు (జనవరి 3) ఉదయం టీజర్ ను రిలీజ్ చేసారు. హైదరాబాద్ లో ఏఏఏ సినిమాస్ లో నిర్వహించిన ఈవెంట్ లో మారుతి ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు.
హిందూ పురాణాల ప్రకారం భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరికుడు (బార్బరిక్). ప్రపంచం చూడని అలాంటి ఐకానిక్ క్యారక్టర్ పేరు మీదుగా ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా రూపొందిచడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంటెన్స్ క్యారెక్టర్స్, వారి సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. భీష్మ శబదం, శ్రీ గరుడ పురాణం గ్రంధాలను ప్రధానంగా చూపించగా.. ''స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి" అని రంగస్థల నాటకంలో శ్రీకృష్ణుడి పాత్రధారి చెబుతాడు. ఆ తర్వాత క్రైమ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో సాగిన ఈ టీజర్.. వసిష్ట ఎన్ సింహ - సాంచి రాయ్ మధ్య ప్రేమకథను కూడా పరిచయం చేస్తుంది. అక్కడి నుంచి ప్రతి పాత్ర గ్రే షేడ్స్ కలిగి ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.
"ఒకడు త్రాచు పాము తోకను తొక్కాడు. ఆ పాము తొక్కిన వాడిని కాటేయబోతుంది" అని చెబుతుండగా.. "మరి తొక్కించిన వాడి సంగతేంటి?" అనే ప్రశ్న ఎదురవుతుంది. ఆ తర్వాత నగరంలో మిస్టీరియస్ మర్డర్స్ జరుగుతున్నట్లు, వాటి వెనక ఎవరో ముసుగు వ్యక్తి ఉన్నట్లు చూపించారు. టీజర్ లో ఒక అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు, ఆమెను రక్షించడానికి ఓ రక్షకుడు రావడం ఉత్కంఠను కలిగిస్తుంది. చివరగా, సత్యరాజ్ ను బార్బారిక్ పాత్రలో రివీల్ చేసారు. అయితే అతను నిజంగానే బార్బారికుడా లేదా మారువేషంలో ఉన్నాడా అనేది స్పష్టంగా తెలియడం లేదు.
ఇందులో సత్యరాజ్ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బార్బారిక్ పాత్రలో ఆయన చాలా ఇంటెన్స్ గా కనిపించారు. సత్యం రాజేష్ రెండు వేర్వేరు గెటప్‌లలో ఉండటం అతని పాత్రలో మరో కోణం ఉందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. వశిష్ట సింహా - సాంచి రాయ్ ఓవైపు ప్రేమికులుగా తెరపై మంచి కెమిస్ట్రీని పంచుకుంటూనే, మరోవైపు మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తుండటం ఆశ్చర్యపరుస్తుంది. ఉదయ భాను చాలా కాలం తర్వాత ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించి షాక్ ఇచ్చింది. క్రాంతి కిరణ్, విటివి గణేష్, మొట్టా రాజేంద్రన్, మేఘన తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
ఓవరాల్ గా ఈ సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుందని 'బార్బారిక్' టీజర్ హామీ ఇస్తోంది. దర్శకుడు మోహన్ శ్రీవత్స సమకాలీన ఘటనలకు బార్బారిక్ వంటి మైథలాజికల్ క్యారక్టర్ ను జోడిస్తూ ఎలాంటి కథను చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. టీజర్ లో నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ.. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఉన్నాయి. ఇవి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాజేష్ నంబూరు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించి ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాద్యతలు నిర్వహించారు. శ్రీనివాస్ పున్న ఆర్ట్ డైరెక్టర్ గా, రామ్ సుంకర స్టంట్ మాస్టర్ గా వర్క్ చేసారు. త్వరలోనే ఈ సినిమాని తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.