ట్రెండీ టాక్: మగ ఆర్టిస్టులు అలా చేయొచ్చు కానీ..!
ఇటీవల 'యానిమల్' చిత్రంలో రణబీర్ తో ఘాటైన సన్నివేశాల్లో జీవించిన ట్రిప్తి దిమ్రీకి ఎదురైన సమస్య ఇది.
ఒక అందమైన అమ్మాయి.. అబ్బాయిని కవ్వించింది. అతడు ఆమె అందాల వలకు ఇట్టే చిక్కాడు. ఆమె వలపు బాణాలు కొంటె చూపులను తాళలేక ఆమెతో నిండా మునిగిపోయాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ బెడ్ రూమ్ లో చెలరేగిపోవడం.. ఘాటైన సన్నివేశాల్లో జీవించడం ఇవన్నీ.. వెండితెరపై వీక్షించేందుకు యువతరం ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంది.
సమస్య ఆ సన్నివేశానిది కాదు.. ఈ సన్నివేశంలో నటించిన ఆడ- మగ ఇద్దరిదీ. ఈ సన్నివేశంలో ప్లస్సు, మైనస్సు, ఎలక్ట్రాన్- ప్రోటాన్ నడుమ ఆకర్షణ అనేది చాలా సహజసిద్ధమైనది. వారిమధ్య ప్రేమ చిగురించడం అటుపై రోమాంచిత సన్నివేశంలోకి వెళ్లిపోవడం ప్రకృతి సిద్ధమైన చర్య. కానీ ఆ సన్నివేశంలో నటించిన అమ్మాయికే ఎందుకు చిక్కొచ్చి పడుతోంది.
అలా ఎందుకు భరి తెగించింది? అతడితో అలా బెడ్ రూమ్ లో ఘాటైన సన్నివేశాల్లో జీవించింది అంటే తనకు వ్యక్తిగతంగా క్యారెక్టర్ ఉందా లేదా? అని ప్రశ్నిస్తుంది ఈ ప్రపంచం. నిజ జీవితంలోను ఇంచుమించు ఆ నటి అలానే ఉంటుంది! అనే అపోహ కూడా ప్రబలంగానే ఉంటుంది. ఇటీవల 'యానిమల్' చిత్రంలో రణబీర్ తో ఘాటైన సన్నివేశాల్లో జీవించిన ట్రిప్తి దిమ్రీకి ఎదురైన సమస్య ఇది. కేవలం ట్రిప్తీకి మాత్రమే కాదు.. ఇలాంటి రెచ్చగొట్టే పాత్రల్లో కనిపించిన ప్రతి నటీమణికి ఎదురైన సమస్య ఇది. ఇలాంటి నటీమణులు ఎదుటి సమాజం ఏమని ప్రశ్నిస్తుందో భయపడాల్సిన పరిస్థితి. కొన్ని ప్రశ్నలకు తప్పించుకోవాల్సిన ధైన్యం. నటీమణి క్యారెక్టర్ ని దిగజార్చి మాట్లాడతారు. పబ్లిక్ లో దూషణలు ఎదుర్కోవాలి. ఇంట్లో వాళ్లు కూడా చివరికి దీనిపై సందేహిస్తారు. అలా చేయకూడదని వారిస్తారు. కానీ రంగుల ప్రపంచంలో అలా కుదురుతుందా? నటన అంటే ప్రతి వైవిధ్యమైన పాత్రను అందిపుచ్చుకోవడం నటించడం.. ట్రిప్తీ కూడా తాను అదే చేశానని అంగీకరించింది.
నిజానికి యానిమల్ లోని ఎక్స్ అనే సన్నివేశంలో ట్రిప్తి దిమ్రీ మాత్రమే కాదు.. తనతో అర్థనగ్నంగా జీవించిన రెచ్చి పోయి పెదవి ముద్దులు పెడుతూ, రోమాన్స్‌లో విరుచుకుపడుతూ నగ్నంగా కనిపించిన రణబీర్ క్యారెక్టర్ ని ఎందుకని దూషించరు? అతడు మగాడు కాబట్టి అలా చేయొచ్చనే సాంప్రదాయ భారతీయ ఔట్ డేటెడ్ తరం పురుషపుంగవుల అజ్ఞానం అని అనుకోవాలా?
యానిమల్ - బ్యాడ్ న్యూజ్ వంటి చిత్రాల్లో ఘాటైన రోమాంచితమైన వివాదాస్పద పాత్రలను పోషించిన ట్రిప్తీ దిమ్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఒక నెటిజన్ ఎక్స్ ఖాతాలో ప్రశ్నించాడు. అతడి ఉద్ధేశం ఆ యువతి నిజ జీవితంలోను చెడిన యువతి అనేదే కదా! కానీ ట్రిప్తీ దిమ్రీ తన పనిని సమర్థించుకోవడానికి ముందుకు వచ్చారు. సినిమా అంటే నిజ జీవితంలోని సంక్లిష్టతలను చూపించాలి. వీక్షకులకు వారు ఏమి చూడాలనుకుంటున్నారో .. ఏమి చూడకూడదో ఎంచుకునే హక్కు ఉంది. కానీ ఇలా ఒకరిని దూషించే హక్కు లేదు! మగాళ్లు అయితే ఒకలా, ఆడాళ్లు అయితే ఇంకోలా చూడటం సమాజానికి తగదు. వెండితెరపై రొమాన్స్ చేయడంలో ఆడా - మగా ఇద్దరిదీ సమాన పాత్ర. దానికి సమానత్వాన్ని ఆపాదించాలి. ఇకనైనా మేల్ పక్షపాతానికి బాయ్ బాయ్ చెప్పాలి.