తెలుగు త్రిష వెర్సస్ తమిళ త్రిష

కెరీర్ ముగింపు దశకు వచ్చేయడంతో పెళ్లి వైపు అడుగులు వేయాలనుకుంది.

Update: 2024-09-13 02:45 GMT

తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు నంబర్ వన్ కథానాయిక స్థానానికి గట్టి పోటీదారుగా ఉండేది త్రిష. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో దక్షిణాదిన ఆధిపత్యం చలాయించిన హీరోయిన్ ఆమే. ఐతే కొన్నేళ్ల తర్వాత ఆమె ప్రభ తగ్గిపోయింది. కెరీర్ ముగింపు దశకు వచ్చేయడంతో పెళ్లి వైపు అడుగులు వేయాలనుకుంది. కానీ ఆ బంధం నిశ్చితార్థం వరకే పరిమితమైంది. ఆపై మళ్లీ ఆమె సినిమాల్లో బిజీ అయింది. ఆశ్చర్యకరంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ ఆమె మంచి స్థాయిని అందుకుంది. తమిళం, తెలుగులో పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ బిజీ యాక్ట్రెస్ అయిపోయింది. గత ఏడాది విజయ్ మూవీ ‘లియో’లో ఆమెనే కథానాయికగా నటించింది. ఇప్పుడు కమల్ హాసన్ మూవీ ‘థగ్ లైఫ్’; అజిత్ సినిమా ‘విడా ముయర్చి’తో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో త్రిష నటిస్తుండడం విశేషం.

ఇంకా పెద్ద విశేషం ఏంటంటే.. సంక్రాంతికి అటు తమిళంలో, ఇటు తెలుగులో త్రిష నటించిన భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. చిరు సినిమా ‘విశ్వంభర’ జనవరి 10కి ఎప్పుడో ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అజిత్ మూవీ ‘విడా ముయర్చి’ని ముందు దీపావళికి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆలోచన మారింది. షూట్ ఆలస్యం అవుతుండడంతో ఆ మూవీని సంక్రాంతికి వాయిదా వేశారు. ఆ పండక్కి సినిమా రావడం ఖాయం. తమిళంలో వేరే సినిమాలు కూడా రేసులో ఉన్న అందరి దృష్టి అజిత్ మూవీ మీదే ఉండనుంది. తెలుగులో కూడా ‘విశ్వంభర’నే నంబర్ వన్ మూవీగా మారబోతోంది. ఇలాంటి రెండు భారీ చిత్రాల్లో త్రిషనే కథానాయికగా నటించడం విశేషమే. 20 ఏళ్ల కెరీర్ తర్వాత, 40 ఏళ్ల వయసులో ఇంత క్రేజీ సినిమాల్లో కథానాయికగా సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో ప్రేక్షకులను పలకరించబోతుండడం చాలా ప్రత్యేకం.

Tags:    

Similar News