సౌత్-నార్త్ హీరోలు కలిసి పని చేయాలి.. టాప్ హీరో కామెంట్
తాజా ఈవెంట్‌లో బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సౌత్ సినిమాలు వరుసగా ఉత్తరాది బెల్ట్ లో భారీ కలెక్షన్స్ సాధిస్తూ ట్రేడ్‌ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉత్తరాది మార్కెట్ నుంచి 500 కోట్లు అంతకుమించి తెలుగు సినిమాలు వసూల్ చేయడం అన్నది ఇటీవల ట్రెండ్ గా మారింది. దీంతో దక్షిణాది సినిమాలకు ఉత్తరాది ట్రేడ్, థియేట్రికల్ చైన్ సిస్టమ్ పెద్ద పీట వేస్తోంది. సినిమా అనేది ఒక వ్యాపార కళ. కళ డబ్బు తేవాలి! అనే ప్రాతిపదికన సీన్ అంతా మారిపోయింది. ఆర్జనకు ఉత్తరాది దక్షిణాది అనే విభేధం లేదు గనుక ఇప్పుడు తెలుగు హీరోలు, తెలుగు దర్శకులకు పెద్ద పీట వేస్తున్నారు.
బాలీవుడ్ క్రిటిక్స్, సినీవిశ్లేషకులు ఇప్పటికే దక్షిణాది హవాను అంగీకరించారు. ఇటీవల హిందీ స్టార్లు కూడా నిజాయితీగా దీనిని అంగీకరిస్తున్నారు. తాజా ఈవెంట్‌లో బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడు తన `బేబీ జాన్` రిలీజ్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. పాన్-ఇండియా చిత్రాలను రూపొందించడానికి దక్షిణాది- ఉత్తరాది చిత్ర పరిశ్రమలు చేతులు కలిపాయని అన్నాడు. ఇరు పరిశ్రమల హీరోల కలయికతోనే ఇకపై పాన్ ఇండియా సినిమాలు వెల్లువెత్తుతాయని కూడా వ్యాఖ్యానించాడు. రెండు పరిశ్రమల మధ్య సహకారం పాన్ ఇండియా విడుదలను ఎలా ముందుకు తీసుకువెళుతుందనే దాని గురించి తెలివైన వరుణ్ మాట్లాడాడు. ధావన్ నటించిన బేబి జాన్ ఈ నెలలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సౌత్ నార్త్ హీరోలు కలిసి పని చేయాలనే బలమైన ఆకాంక్షను అతడు బయటపెట్టాడు. పుష్ప 2 విజయం చూశాక.. వరుణ్ ధావన్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.
`పుష్ప 2: ది రూల్` కేవలం వారం రోజుల్లోనే బాక్సాఫీస్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రెండో వారంలోను విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. బేబీ జాన్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కించారు. జవాన్ తర్వాత అతడికి రెండో హిందీ సినిమా. ఇది 2016 తమిళ చిత్రం తేరి (విజయ్ హీరో)కి రీమేక్. వరుణ్ ధావన్‌తో పాటు కీర్తి సురేష్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్, జరా జ్యాన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.