వరుణ్ తేజ్ 15.. హారర్ వేట మొదలైంది!

ఇటీవల అధికారికంగా ఈ సినిమా ప్రకటన రాగా, ఒక క్రియేటివ్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.

Update: 2025-01-29 07:04 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లో మళ్లీ బిగ్ హిట్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల వచ్చిన సినిమాలతో ఊహించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా, వరుణ్ ఎప్పటికప్పుడు తన సినిమాల విషయంలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ భారీ హారర్ కామెడీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.


ఇటీవల అధికారికంగా ఈ సినిమా ప్రకటన రాగా, ఒక క్రియేటివ్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. హారర్ నేపథ్యంలో కామెడీతో కూడిన వినోదాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా టీమ్ పూర్తిగా వియత్నాంలో సెటిలైంది. అక్కడ అద్భుతమైన లొకేషన్లను స్కౌటింగ్ చేస్తూనే, కధా చర్చలను కూడా ముగిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే విడుదలైన చిత్ర యూనిట్ తాజా ఫోటోల్లో, వరుణ్ తేజ్ వియత్నాం బ్యాక్‌డ్రాప్‌లో స్టన్నింగ్ లుక్‌తో కనిపించారు. సహజంగా మెగా హీరోలకు అందం, స్టైల్ లో ఏ మాత్రం తగ్గదు. ఇప్పుడు వరుణ్ కూడా ఈ సినిమాకి తగ్గట్టు తన లుక్‌లో మార్పులు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇది వరుణ్ తేజ్‌కు చాలా కీలకమైన సినిమా. ఇటీవల కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవడం కుదరలేదు. అయితే, ఈ సారి భారీ బడ్జెట్‌తో, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రత్యేకించి హారర్ కామెడీ అంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటి జానర్‌లో మెగా హీరో చేయడం, దానికి తగిన స్కేల్‌లో సినిమా తెరకెక్కడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పని చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన తమన్, ఈ హారర్ కామెడీకి ఎనర్జీని తీసుకురావడానికి ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించనున్నారని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. విజువల్‌గా హై స్టాండర్డ్స్‌ తో రూపొందబోతున్న ఈ సినిమా, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఈ మూవీని ఒక పక్క కామెడీ, మరోపక్క అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించేందుకు టీమ్ అన్ని చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Tags:    

Similar News