వరుణ్ సందేశ్.. ఈసారి గట్టిగా కొట్టాల్సిందే..
ఇక ఇప్పుడు వరుణ్ సందేశ్ నిందా అనే కథతో మళ్ళీ తన కెరీర్ ను సెట్ చేసుకోవాలి అని చూస్తున్నాడు. "నిందా" ఈనెల 21న విడుదల కానుంది.
హ్యాపీ డేస్ సినిమాతో పక్కింటి అబ్బాయి తరహాలో కనిపించిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. కెరీర్ మొదట్లో అతనికి గ్యాప్ లేకుండా వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే అతని తొందరపాటు నిర్ణయమో లేదంటే దురదృష్టమో కానీ కొత్త బంగారులోకం సినిమా తర్వాత అతను చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ ను అందుకోలేదు.
దిల్ రాజు లాంటి నిర్మాత తో కూడా అతనికి మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పటికీ సక్సెస్ రాలేకపోయింది. అయితే ఈ హీరో మాత్రం గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది ఏదో ఒక విధంగా ఆడియన్స్ ను పలకరించే ప్రయత్నం చేస్తున్నాడు. 2015 వరకు ఏడాది మూడు, నాలుగు సినిమాలు చేసుకుంటూ వచ్చిన వరుణ్ సందేశం ఇప్పుడు మాత్రం ఒక సినిమాతో రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది.
చాలా వరకు అతని మార్కెట్ తగ్గిపోయింది. ప్రస్తుత రోజుల్లో ఎంతో డిఫరెంట్ గా సినిమాలు చేస్తే గాని ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. ఇక ఇప్పుడు అతను నిందా అనే ఒక డిఫరెంట్ సినిమాతో సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో అతను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. గతంలో అల్లరి నరేష్ కూడా ఇదే తరహా లో నాంది అనే సీరియస్ కాన్సెప్ట్ తో సక్సెస్ అందుకొని ఫామ్ లోకి వచ్చాడు.
ఇక ఇప్పుడు వరుణ్ సందేశ్ నిందా అనే కథతో మళ్ళీ తన కెరీర్ ను సెట్ చేసుకోవాలి అని చూస్తున్నాడు. "నిందా" ఈనెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే బాగా పాపులర్ అయింది. దర్శకుడు రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండనుంది. వరుణ్ సందేశ్ ఇందులో గంభీరమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా సక్సెస్ అయితేనే అతనికి భవిష్యత్తులో మరిన్ని మంచి ఆఫర్లు వస్తాయి. ప్రస్తుతం లిస్టులో రెండు కథలు ఉన్నప్పటికీ వరుణ్ సందేశ్ ఈ సినిమా పైనే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నాడు. ఇక గతంలో చేసినటువంటి రొటీన్ సినిమాలు కాకుండా ఇకనుంచి చాలా విభిన్నమైన కథలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అని వరుణ్ సందేశ్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేశారు.