ఇదేం చిత్రం.. పార్ట్-2 ముందు రిలీజా?
కానీ తర్వాత సరైన సినిమాలు చేయక తన కెరీర్ డౌన్ అవుతూ వెళ్లింది.
తమిళ నటుడు విక్రమ్ ఎంత మంచి పెర్ఫామరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశలో సామి, పితామగన్ (శివపుత్రుడు), అన్నియన్ (అపరిచితుడు) లాంటి బ్లాక్ బస్టర్లతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా అవతరించాడు. ఈ ఊపులో అతను ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడవుతాడని అనుకున్నారు. కానీ తర్వాత సరైన సినిమాలు చేయక తన కెరీర్ డౌన్ అవుతూ వెళ్లింది. ‘ఐ’ సహా ఎన్నో భారీ ప్రయత్నాలు చేశాడు. అన్నీ నిరాశకే గురి చేశాయి. ‘అపరిచుడు’ తర్వాత అతడికి ఇప్పటిదాకా నిఖార్సయిన హిట్ మూవీ ఒక్కటీ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. తన శైలిలో అవతారాలు మారుస్తూ ప్రయోగాలు చేసినా.. మధ్య మధ్యలో మాస్ సినిమాలు ట్రై చేసినా అతడికి కలిసి రాలేదు. విక్రమ్ చివరి చిత్రం ‘తంగలాన్’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. కానీ విక్రమ్ కోరుకునే మాస్ హిట్ మాత్రం కాలేదు.
ఐతే విక్రమ్ నెక్స్ట్ రిలీజ్ ‘వీర ధీర శూరన్’ మాత్రం తన ఆకలి తీర్చేలాగే కనిపిస్తోంది. సిద్ధార్థ్‌తో ‘చిన్నా’ సినిమా తీసిన అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో విక్రమ్ కిరాణా కొట్టు నడిపే మామూలు వ్యక్తిగా కనిపించనున్నాడు. హీరో కిరాణా కొట్టు నడపడం ఏంటి.. ఇలాంటి పాత్రలో హీరోయిజం ఎలా సాధ్యం అని సందేహం కలగొచ్చు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు ప్రి టీజర్లు రాగా.. ఇప్పుడు టీజర్ కూడా లాంచ్ చేశారు. ఈ మూడింట్లోనూ హీరోయిజం మామూలుగా లేదు. పైకి మామూలుగా కనిపించినా.. హీరో వెనుక ఏదో పెద్ద స్టోరీనే ఉన్నట్లుంది. అతణ్ని చంపడానికి ఒక పోలీస్ ఆఫీసర్‌తో పాటు పెద్ద పెద్ద గూండాలు స్కెచ్ వేసి జాతర జరుగుతున్న టైంలో ఒక్క రాత్రిలో తన కథ ముగించడానికి రంగంలోకి దిగుతారు. వాళ్లకు హీరో ఎలా చెక్ పెట్టాడన్నది ఈ సినిమా కథాంశం. ఈ కథ మొత్తం ఒక్క రాత్రిలో నడిచేలా కనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాను పార్ట్-2 పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు రెండు పార్టులు తీయడం మామూలే కానీ.. పార్ట్-1 రిలీజ్ కాకుండా పార్ట్-2ను ముందు విడుదల చేయడం విడ్డూరం. అంటే వర్తమానంలో ఈ కథను నడిపించి.. తర్వాత బ్యాక్ స్టోరీని పార్ట్-1 పేరుతో తర్వాత రిలీజ్ చేస్తారన్నమాట. ‘వీర ధీర శూరన్’ను జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు. అది సంక్రాంతికా తర్వాతా అన్నది క్లారిటీ లేదు.