ఒరిజినల్: రాజకీయాల్లోకి రావొద్దంటూ రజనీకి వీరప్పన్ హెచ్చరిక
ఆయన (ఎంజీఆర్) చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాలు తెలుసు. ఎంజీఆర్ లాంటి వారు పుట్టటం కష్టం. రజనీకాంత్ కూడా ఆయన మాదిరి అవుతారని నాకు తెలుసు.
ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. డెబ్బై.. ఎనభైల్లో పుట్టిన వారికి వీరప్పన్ సుపరిచితుడు. గంధం చెక్కల గజ దొంగ మాత్రమే కాదు.. దాదాపు మూడు రాష్ట్రాలకు మచ్చెమటలు పుట్టించిన అతడ్ని ఎన్కౌంటర్ లో చంపేయటం తెలిసిందే. అతగాడికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను జీ5 ఓటీటీ ప్లాట్ ఫాం మీద విడుదల చేసింది. ఇందులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తావన ఉండటమే కాదు.. ఆయన్నురాజకీయాల్లోకి రావొద్దంటూ గౌరవంతో కూడిన హెచ్చరిక చేయటం కనిపిస్తుంది. తనకున్న అభిమానంతో పాటు.. రజనీ లాంటి మైండ్ సెట్ ఉన్న వారికి.. రాజకీయాలు ఏ మాత్రం సూట్ కావన్న మాట ఆయన మాటల్ని చూస్తే అర్థమవుతుంది.
రజనీకాంత్ 73వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ.. రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలపగా.. జీ5 మాత్రం.. ‘కూసే మునిసామి వీరప్పన్’ పేరుతో స్ట్రీమింగ్ చేయనున్న డాక్యుమెంటరీ నుంచి ఒక ఒరిజినల్ వీడియోనున పంచుకుంది. అందులో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న దానిపై తన స్పందనను తెలియజేస్తారు. ఆయన్ను రాజకీయాల్లోకి రావొద్దంటూ వారిస్తారు. ఆయన్ను దోచేందుకు.. మింగేసేందుకు చాలా మొసళ్లు వేచి చూస్తున్నాయని వార్నింగ్ ఇవ్వటం కనిపిస్తుంది. రజనీకాంత్ ను ఎంజీఆర్ తో పోల్చటం ఈ వీడియోలో కనిపిస్తుంది.
‘‘ఆయన (ఎంజీఆర్) చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజల కష్టాలు తెలుసు. ఎంజీఆర్ లాంటి వారు పుట్టటం కష్టం. రజనీకాంత్ కూడా ఆయన మాదిరి అవుతారని నాకు తెలుసు. రజనీకాంత్ అందరిని గౌరవిస్తారు. ఎవరిపట్లా అమర్యాదగా ప్రవర్తించరు. దేవుడిని బాగా నమ్ముతారు. కానీ.. ఒక్క విషయం ఆయనకు చెప్పాలి. అయ్యా రజనీకాంత్.. నేను నీతో మాట్లాడుతున్నా’’ అంటూ తాను చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశాడు.
‘‘రాజకీయాల్లోకి రావొద్దు. ఎవరికీ మద్దతు తెలపొద్దు. నిన్ను మింగటానికి ఎన్నో మొసళ్లు వెయిట్ చేస్తున్నాయి. అవి ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయచేసి అమాయకుడిలా బలి కావొద్దు’’ అంటూ వీరప్పన్ చెప్పిన మాటల ఒరిజినల్ వీడియోను విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. రజనీ గురించి వీరప్పన్ చేసిన వ్యాఖ్యల బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే.. 1996లో జరిగిన తమిళనాడు ఎన్నికలకు ముందు జయలలిత (అమ్మ)కు రజనీ వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే.. జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని దేవుడు కూడా రక్షించలేడని వ్యాఖ్యానించిన వైనాన్ని గుర్తుచేస్తారు. అయితే.. అప్పట్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే.. రజనీకాంత్ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు కానీ.. తన మాటలతో తన మనసులోని మాటల్ని వ్యక్తం చేసే వారని చెప్పాలి. అయితే.. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లో రావాలని అంతా సిద్ధం చేసుకున్న తర్వాత.. ఆరోగ్య కారణాలతో ఆయన వెనక్కి తగ్గటం కనిపిస్తుంది. ఇక.. కూసే మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ ఈ గురువారం (డిసెంబరు 14) స్ట్రీమింగ్ కానుంది.