ఫిబ్రవరి 2025: కళ్లన్నీ శంభాజీ మహారాజ్‌పైనే
2025 ఆరంభం బాలీవుడ్‌కి ఏమంత కలిసి రాలేదు. ఇప్పటికే కొన్ని భారీ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
2025 ఆరంభం బాలీవుడ్‌కి ఏమంత కలిసి రాలేదు. ఇప్పటికే కొన్ని భారీ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. వీటిలో అక్షయ్ కుమార్- వీర్ పహారియా నటించిన 'స్కై ఫోర్స్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా నిరాశపరిచింది. కంటెంట్ సహా అక్షయ్ , వీర్ పహారియా నటన బావున్నా టైమ్ కలిసి రాలేదు. దీంతో `స్కై ఫోర్స్` యావరేజ్ గా నిలిచింది. షాహిద్ కపూర్ నటించిన దేవా చిత్రం విడుదలై ఇది రొటీన్ సినిమాగా తేలిపోయింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. దీంతో ఇది ఫ్లాప్ దిశగా సాగుతోంది. అలాగే జునైద్ ఖాన్ - ఖుషి కపూర్ నటించిన `లవ్‌యాపా` ఈనెల 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఒక సౌత్ సినిమా రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమాకి డెబ్యూ కాస్టింగ్ కారణంగా అంతగా బజ్ లేదు. లవ్‌యాపా 7 ఫిబ్రవరి 2025న విడుదల కానున్న రొమాంటిక్ కామెడీ చిత్రం. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. జునైద్ ఖాన్ - ఖుషీ కపూర్ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. యూత్ ఫుల్ లవ్ స్టోరి బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
హిమేష్ రేషమ్మియా ప్రయోగాత్మక చిత్రం 'బ్యాడాస్ రవి కుమార్' కూడా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇది యాక్షన్-మ్యూజికల్ చిత్రం. హిమేష్ రేషమ్మియా ప్రధాన పాత్రలో నటించారు. ప్రభుదేవా, కీర్తి కుల్హారి, సన్నీ లియోన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. హిమేష్ రేషమ్మియా నటన, ప్రయోగాత్మక కంటెంట్ ఈ చిత్రానికి ప్లస్ కానున్నాయి. మరోవైపు `మేరే హస్బెండ్ కి బివి` లాంటి రొమాంటిక్ కామెడీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఫిబ్రవరి 21న పెద్ద తెరపైకి రానుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. గతంలో ఆయన `పతి, పత్ని ఔర్ వో` వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి.
అయితే వీటన్నిటినీ మించి హిస్టారికల్ వార్ డ్రామా నేపథ్యంలో రూపొందించిన చావాపైనే అందరి కళ్లు ఉన్నాయి.
విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన `చావా` ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించారు. శంభాజీ విరోచిత పోరాటాలతో ట్రైలర్ విడుదల కాగా, అద్భుత స్పందన లభించింది. విక్కీ కౌశల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. రష్మిక మందన్న అతడి భార్య ఏసు భాయి పాత్రను పోషించింది. `చావా`ను మాడాక్ ఫిల్మ్స్ నిర్మించగా, లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. కాంబినేషన్ సహా కథాంశం పరంగా చావా గురించి చాలా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.