ఇంతకీ విజయ్ దేవరకొండ ఎవరిని అన్నట్టు?
ఇదే విషయం మీద విజయ్ తాజాగా స్పందించారు. ఎప్పటికైనా 200 కోట్ల వసూళ్లు సాధిస్తానని, అది తన మీద తనకున్న నమ్మకమని అన్నారు
'లైగర్' టైంలో తన సినిమా రూ. 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేయడం, బాక్సాఫీస్ లెక్కలు 200 కోట్ల నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ ఆ చిత్రం డిజాస్టర్ గా మారడంతో, రౌడీ హీరోని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇదే విషయం మీద విజయ్ తాజాగా స్పందించారు. ఎప్పటికైనా 200 కోట్ల వసూళ్లు సాధిస్తానని, అది తన మీద తనకున్న నమ్మకమని అన్నారు.
'ఫ్యామిలీ స్టార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవరకొండ విజయ్ మాట్లాడుతూ.. "నా సినిమా 100 కోట్లు కొట్టింది అనే గాసిప్ వినాలని అనుకుంటున్నానని నా ఫస్ట్ మూవీ టైంలో చెప్పాను. అప్పుడు అది నాకొక కల. అది నిజం చేసిన నాలుగో సినిమా గీతగోవిందం. అప్పుడు ఎన్నో పొగడ్తలు విన్నా.. ఎంతో ప్రేమను అందుకున్నా. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకూ ఆ సినిమాని బీట్ చేసే మూవీ నేను చేయలేదు. ఆ 100 కోట్ల కలలు కన్న ఆ పిల్లోడు, మళ్లీ 200 కోట్లు కొడతానని ఓ సినిమాకి చెప్పాడు"
"200 కోట్లు కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ, కొట్టలేదు. ఈరోజు వరకు నన్ను చాలామంది అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఆ వయసులో, కెరీర్ ప్రారంభంలో అలా మాట్లాడటం యారోగెన్స్ లా వినిపిస్తుందని ఎంతో మంది ప్రేమతో కోపంతో చెబుతూనే ఉన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను.. 200 కోట్లు కొడతానని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, చెప్పిన తర్వాత కొట్టకపోవడం తప్పు. దాని వల్ల ఎన్నో తిట్లు తిన్నాను.. అవమానాలు పడ్డాను. నేను ఏదొక రోజు 200 కోట్లు కొడతాను. అప్పటి వరకూ నన్ను ఎంతైనా తిట్టండి నేను పడతా. ఇప్పటికీ నాకు పొగరు, బలుపు అనుకునేవారు ఉంటారు. కానీ ఇది నా మీద నాకున్న కాన్ఫిడెన్స్, నమ్మకం." అని అన్నారు.
"ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి? ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్లీ కొట్టలేరా ఏంటి?" అంటూ విజయ్ దేవరకొండ తన అభిమానులని ఉత్సాహ పరిచారు. 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ అవుతున్న తరుణంలో విజయ్ మరోసారి తన స్టేట్మెంట్ ను గుర్తు చేయడం, 200 కోట్ల సినిమా ఇచ్చే వరకూ తనని ఎంత తిట్టినా పడతానని చెప్పడం నెట్టింట వైరల్ గా మారింది.
ఎవరో స్టార్ అయినప్పుడు మనం అవ్వలేమా, ఇంకెవరో రెండు వందల కోట్లు కొడితే మనం కొట్టలేమా అని విజయ్ దేవరకొండ అనడంతో.. ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్లు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గత 40 ఏళ్ల నుంచీ స్టార్స్ గా ఉన్నవాళ్లు ఎవరూ కూడా ఇలా ఎప్పుడూ అనలేదని, మళ్లీ మళ్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల నిజంగానే అతనికి పొగరు అనుకునే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో విజయ్ మాటలను తప్పుపట్టాల్సిన అవసరం లేదనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ దేవరకొండ.. తన కష్టంతోనే ఈ స్థాయికి ఎదిగారు. పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. నాలుగో సినిమాకే 100 కోట్లు కొట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించారు. ఇప్పుడు తన మీద తనకున్న నమ్మకంతోనే ఎప్పటికైనా 200 కోట్లు కొట్టగలనని ధీమాగా చెప్తున్నారు. అందులో వీడీ తప్పేమీ లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ ఇతర హీరోలతో కంపేర్ చేసుకోవడం విజయ్ ఉద్దేశ్యం కాదని, తన మీద తనకున్న విశ్వాన్ని నమ్మకాన్ని మాత్రమే వ్యక్తం చేశాడని అంటున్నారు. ఏదేమైనా 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో తన రెండు వందల కోట్ల కలను రౌడీ స్టార్ నిజం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.