నైతికత ఉండే విలన్‌ గా ఐతే ఓకే..!

సినిమాకు వస్తున్న పాజిటివ్ బజ్ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పోస్ట్‌ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు.

Update: 2024-06-21 06:27 GMT

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరో విజయాన్ని మహారాజా సినిమాతో దక్కించుకున్నాడు. తమిళనాట మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా తెలుగు లో కూడా మంచి వసూళ్లను నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు పేర్కొన్నారు.

ఇప్పటికే రూ.50 కోట్లు క్రాస్‌ చేసిన మహారాజా సినిమా అతి త్వరలోనే వంద కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమాకు వస్తున్న పాజిటివ్ బజ్ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పోస్ట్‌ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు.

తాజాగా విజయ్ సేతుపతి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ సమయంలో విజయ్ సేతుపతి ముందు ముందు హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే గతంలో చేసిన విలన్‌ పాత్రల మాదిరిగా కాకుండా ఉండాలని భావిస్తున్నాడట.

విలన్ గా నటించేందుకు ఓకే కానీ, ఆ విలన్ పాత్రకు కొంతలో కొంత అయినా నైతికత అనేది ఉండాలి, ఎవరి మనోభావాలను దెబ్బ తీయని విధంగా విలన్ పాత్ర ఉండాలి అనేది తన అభిప్రాయం అన్నట్లుగా విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. అలాంటి విలన్ పాత్రలతో వస్తే తాను సిద్ధం అన్నట్లుగా పేర్కొన్నాడు.

మూఢ నమ్మకాలను ప్రోత్సహించే విధంగా ఉండే సినిమాలను నేను చేయాలనుకోవడం లేదు. మనం చేసే ప్రతి పాత్ర కొంత మంది పై అయినా ప్రభావం చూపిస్తుంది. కనుక ప్రతి పాత్రను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

సినిమాలో చూపించే పాత్రల విషయంలో కూడా కొన్ని నీతి సూత్రాలు ఉండాలి అనేది తన అభిప్రాయం. అందుకే నైతికత ఉండే విలన్ పాత్రలు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లుగా తెలియజేశాడు. ముందు ముందు తన నుంచి వచ్చే సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయని అన్నాడు.

Tags:    

Similar News