మన 'మహారాజా' ఇంటర్నేషనల్ రాజా..!
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల మనసును హత్తుకునే విధంగా ఉంటుంది
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల మనసును హత్తుకునే విధంగా ఉంటుంది, కొన్ని సినిమాలు కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకోకున్నా కూడా ఎమోషనల్ గా ప్రేక్షకులకు నచ్చుతాయి. అయితే ఆయన కెరీర్ లో 50వ సినిమాగా చేసిన మహారాజా మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేయడంతో పాటు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఓటీటీ ప్రపంచం లో సందడి చేస్తుంది. ఈ స్థాయి విజయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఊహించి ఉండరు అనేది కొందరి అభిప్రాయం.
మహారాజా సినిమా ఒక తండ్రి బాధను చూపించే కథతో రూపొందించడం జరిగింది. సినిమాలో వచ్చే ట్విస్ట్ లతో పాటు, సినిమాను నడిపించిన స్క్రీన్ ప్లే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. విజయ్ సేతుపతి నటన అద్భుతం అంటూనే దర్శకుడి పనితీరును ప్రతి ఒక్కరు మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. ఒక తండ్రి తన కూతురు పట్ల పెంచుకున్న ప్రేమ మరియు అభిమానం ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసి సూపర్ హిట్ అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు.
థియేటర్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహారాజు అక్కడ నుంచి నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రపంచంలో అడుగు పెట్టాడు. తమిళంలో రూపొందిన మహారాజా సినిమాను తెలుగు తో పాటు అన్ని సౌత్ భాషల్లో ఇంకా హిందీ భాషలో కూడా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇండియాలోనే కాకుండా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో అత్యధికంగా చూశారు. ఆయా దేశాల్లో టాప్ లో ట్రెండ్ అయ్యి అందరికి షాక్ ఇచ్చిన ఈ సినిమా మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
ఇంగ్లీషేతర సినిమాల్లో మహారాజా సినిమా అంతర్జాతీయ స్థాయిలో టాప్ 5 లో చోటు సంపాదించింది. సాధారణంగా హిందీ లేదా ఇతర విదేశీ భాషల సినిమాలు ఈ జాబితాలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సారి మన తమిళ సినిమా చోటు దక్కించుకోవడం గొప్ప విషయంగా భావించవచ్చు. నెట్ ఫ్లిక్స్ చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సినిమా 24 రోజుల్లో 15.5 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా 36.4 మిలియన్ ల వాచ్ అవర్స్ ను కూడా సొంతం చేసుకుని ఈ ఏడాది మేటి చిత్రంగా నిలిచింది అని ప్రశంసలు దక్కించుకుంది.
విజయ్ సేతుపతి మైలురాయి సినిమా అయిన మహారాజా ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల ప్రతి ఒక్క సినీ అభిమాని మరియు ఆయన అభిమానుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తూ, మూస పద్దతిలో సినిమాలు చేసే వారికి ఈ సినిమా కచ్చితంగా ఒక మార్గదర్శకం అవ్వాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇలాంటి మనసుకు నచ్చే సినిమాలు, నాన్ కమర్షియల్ సినిమాలు తీసినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.