రీమేక్ గురించి ఆయన్నే అడగండి
తమిళ స్టార్ హీరో విక్రమ్ చాలా కాలం తర్వాత 'తంగలాన్' తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
తమిళ స్టార్ హీరో విక్రమ్ చాలా కాలం తర్వాత 'తంగలాన్' తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొదట సౌత్ భాషల్లో రిలీజ్ అయిన తంగలాన్ ఇటీవల హిందీ లోనూ డబ్ అయి రిలీజ్ అయింది. గత కొన్ని రోజులుగా విక్రమ్ తంగలాన్ ప్రమోషన్ లో భాగంగా మీడియాలో రెగ్యులర్‌గా కనిపిస్తున్న విక్రమ్ తాజాగా ఒక జాతీయ స్థాయి మీడియా సంస్థ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన సూపర్ హిట్ మూవీ 'అపరిచితుడు' హిందీ రీమేక్ గురించి స్పందించాడు. తంగలాన్ సూపర్ హిట్ నేపథ్యంలో విక్రమ్ ప్రతి ఇంటర్వ్యూ చర్చనీయాంశం అవుతోంది.
తాజా ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ... అపరిచితుడు రీమేక్ గురించి ఎలాంటి విషయాలైన దర్శకుడు శంకర్ గారినే అడగాలి. నాకు ఆ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు. రీమేక్ లో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నట్లుగా తెలిసింది. బాలీవుడ్ స్టార్స్ లో నాకు రణ్‌వీర్ సింగ్ అంటే ప్రత్యేమైన అభిమానం. తప్పకుండా అతడు అపరిచితుడు హిందీ వర్షన్ కి సెట్ అవుతాడని భావిస్తున్నాను. శంకర్ గారు కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారని తెలుసు. హిందీ రీమేక్ కు నన్ను ఎందుకు తీసుకోలేదు అనే విషయాన్ని మీరు ఆయన్నే అడగాలి అంటూ జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్నకు విక్రమ్ సమాధానమిచ్చాడు.
రణ్‌వీర్ ను అపరిచితుడు సినిమా రీమేక్ లో చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ విక్రమ్ చెప్పుకొచ్చాడు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అన్న విక్రమ్ తన తాజా చిత్రం తంగలాన్ హిట్ పై చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ముందు ముందు తన నుంచి బ్యాక్ టు బ్యాక్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు, విభిన్నమైన సినిమాలు వస్తాయంటూ హామీ ఇచ్చాడు. హిందీ ప్రేక్షకులను మెప్పించే ఎలిమెంట్స్ తంగలాన్ లో చాలానే ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో హిందీ లో రిలీజ్ చేయలేక పోయామని విక్రమ్ అన్నాడు.
విక్రమ్ కు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిన మూవీ 'అపరిచితుడు'. అలాంటి సినిమాలో విక్రమ్ కాకుండా మరెవ్వరు నటించినా ఆ స్థాయిలో మెప్పించడం సాధ్యం కాదు అనేది చాలా మంది అభిప్రాయం. అలాంటి పాత్ర లో రణ్‌వీర్ సింగ్ ను తీసుకోవడంను చాలా మందికి ఆశ్చర్యం ను కలిగించింది. హిందీ అపరిచితుడు రీమేక్ ప్రకటించి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి తదుపరి అప్డేట్ లేదు. వరుసగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు నిరాశ పరచిన నేపథ్యంలో హిందీ అపరిచితుడు ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ మధ్య హిందీ అపరిచితుడు అటకెక్కిందని వార్తలు వచ్చాయి.