ఆ ఇద్దరు హీరోలకు విశాఖపై వల్లమాలిన ప్రేమ
టాలీవుడ్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బీచ్ సొగసుల విశాఖ నగరాన్ని అమితంగా ప్రేమిస్తారన్న సంగతి తెలిసిందే
టాలీవుడ్ స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బీచ్ సొగసుల విశాఖ నగరాన్ని అమితంగా ప్రేమిస్తారన్న సంగతి తెలిసిందే. చిరు తన విశ్రాంత (రిటైర్ మెంట్ తర్వాత) సమయాన్ని విశాఖలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే గడుపుతానని ఇంతకుముందు ఓ ఈవెంట్లో అన్నారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ విశాఖపై తన ప్రేమను కురిపించారు. వెంకీ విశాఖ బీచ్ పరిసరాల్లో స్పా సెంటర్ లో రిజనవేషన్ కి ప్రాధాన్యతనిస్తారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. వీలుంటే ఇక్కడికి ప్రతిసారీ వచ్చి వెళుతుంటారు.
బీచ్ సొగసుల విశాఖపట్నంపై తన ప్రేమ, అనుబంధం గురించి తాజా ఈవెంట్లో వెంకీ ఓపెనయ్యారు. నేను వైజాగ్ .. దాని సుందరమైన బీచ్‌లను చాలా ప్రేమిస్తాను. నా మొదటి చిత్రం నుండి మీ నగరం నుండి నాకు మద్దతు లభిస్తోంది! అని అన్నారు. తాను కలియుగ పాండవులు, సుందరకాండ వంటి చిత్రాలను విశాఖలోనే షూటింగ్ చేశానని, ఓడరేవు నగరంలో పని చేయడం చాలా ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. మల్లీశ్వరి కూడా విశాఖ బీచ్‌లలో చిత్రీకరించామని, బీచ్ రోడ్లపై బైక్ నడపడాన్ని ఆస్వాధిస్తానని అన్నారు. నేను ఈ అందమైన నగరం ప్రజల ప్రేమాభిమానాలను, ఇక్కడి అందమైన వాతావరణాన్ని కూడా ఆస్వాధిస్తాను అని అన్నారు. పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, మహేష్‌బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కోసం పనిచేస్తున్నప్పుడు తాను విశాఖ నగరంలోనే ఉన్నానని పేర్కొన్నారు. ఈ నగరంతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ క్షణాలను ఎప్పుడూ ఆస్వాధిస్తున్నాను అని అన్నారు. మహేష్, నాగార్జున వంటి పెద్ద స్టార్లు నటించిన సినిమాలతో పోటీపడుతూ వెంకీ నటించిన సైంధవ్ ఈ సంక్రాంతి బరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
యువకులకు క్లాస్:
యువకులు జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవద్దని, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాధించమని సీనియర్ నటుడు, విక్టరీ వెంకటేష్ కోరారు. సర్వశక్తిమంతుడు ఉన్నాడు.. అతడు మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు.. కానీ మీరు కొంచెం ఓపిక పట్టాలి! అని విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉల్లాసంగా ఉండండి.. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు ఈ క్షణంలో జీవించండి! అని ఆయన చెప్పారు. యువ ప్రేక్షకులను ఎప్పుడూ ఉత్సాహపరచాలని వెంకీ కోరారు.