చిరుతో స్టార్ నిర్మాత భేటీ.. సినిమా ఫిక్సా లేక...
బెటర్ హాఫ్ తో షార్ట్ హాలీడే ట్రిప్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సరిగ్గా వాలైంటైన్స్ డే రోజు అమెరికా వెళ్లారు
బెటర్ హాఫ్ తో షార్ట్ హాలీడే ట్రిప్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సరిగ్గా వాలైంటైన్స్ డే రోజు అమెరికా వెళ్లారు. తన భార్య సురేఖతో యూఎస్ ట్రిప్ కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను నటిస్తున్న విశ్వంభర షూటింగ్ లో అమెరికా నుంచి వచ్చిన తర్వాత పాల్గొంటానని చెప్పారు. ఇటీవలే మెగాస్టార్ కు కేంద్ర ప్రభుత్వం.. పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం తెలిసిందే.
ఈ అవార్డు అధికారికంగా ప్రకటించిన తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రోజుల క్రితం పద్మ అవార్డు గ్రహీతలు అందరికీ సన్మానం చేసింది. అప్పుడు చిరంజీవికి కూడా సన్మానం జరిపింది.
ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చిరంజీవిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కు సన్మానం చేయాలనే తన కోరికను షేర్ చేసుకున్నారు. అందుకు చిరంజీవి కూడా ఒప్పుకున్నారు. దీంతో మెగాస్టార్ తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు విశ్వప్రసాద్.
చిరంజీవి గారిని కలవడం అలాగే సన్మానానికి ఆయన పర్మిషన్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. అంటే చిరంజీవిని ఘనంగా సత్కరించేందుకు విశ్వప్రసాద్.. ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారన్న మాట. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అమెరికాలో అన్నయ్యకు సన్మానం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. చిరంజీవితో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ఈమధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు నిర్మాత విశ్వప్రసాద్ మెగాస్టార్ ను కలవడం ఆ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.