టాలీవుడ్‌పైనా WCC చ‌ర్య‌లు?

కేర‌ళ ప్ర‌భుత్వం నియోగించిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు గ‌త నెల‌లో విడుదలైంది.

Update: 2024-09-16 12:30 GMT

కేర‌ళ ప్ర‌భుత్వం నియోగించిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు గ‌త నెల‌లో విడుదలైంది. ఇది మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ప్ర‌ముఖ హీరోపై వేధింపుల కేసు న‌మోద‌వ్వ‌గా 2017లో ఏర్పడిన విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) పోరాటాన్ని చట్టబద్ధం చేసింది. సినిమా సెట్స్ లో వేధింపులు స‌హా న‌టీమ‌ణుల అసౌక‌ర్యాలు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పైనా హేమ క‌మిటీ నివేదిక ప్ర‌స్థావించింది.

ఆలస్యంగానైనా హేమ కమిటీ నివేదిక విడుదల చారిత్రాత్మక నిర్ణయం. తరువాతి వారాల్లో, కన్నడ చిత్ర పరిశ్రమలోని మహిళా సినీ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు ఇదే విధమైన కమిటీని ఏర్పాటు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాసేందుకు కార‌ణ‌మైంది. ఇత‌ర రంగాల‌తో పోలిస్తే.., ముందంజలో ఉన్న డబ్ల్యుసిసి ఇప్పుడు సినిమా ప్రవర్తనా నియమావళి, మలయాళ చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి సిఫార్సుల సమితితో ముందుకు వస్తోంది.

1) అందరికీ ఒప్పందాలు 2) అందరికీ ప్రాథమిక హక్కులు 3) ప్రతి చిత్ర తారాగణం -సిబ్బందికి బీమా 4) ప్రతి చిత్రంపై ప్రతి ఉద్యోగికి అధికారిక IDలు 5) రిపోర్టింగ్ మెకానిజం-పరిష్కార వ్యవస్థ ఏర్పాటుకు కృషి జ‌రుగుతోంది.

WCC వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కొచ్చికి చెందిన నటి సజితా మదాతిల్ (57) దీనిపై చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇప్పుడు హేమ కమిటీ నివేదిక బయటికి వచ్చిన తర్వాత వారి ఫీలింగ్ ఏమిటి? ఇప్ప‌టికైనా విజయం సాధించారని భావించారా? దాని ప్రభావాన్ని ఎలా చూస్తారు? అని ప్ర‌శ్నించ‌గా... ``క‌మిటీ నివేదిక‌ బయటకు వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ``హేమ కమిటీ నివేదిక ఫలితం .. మహిళలు ఎలా స్పందిస్తున్నారో చూస్తున్నాం. స్త్రీలు అంతా బయటకు వచ్చి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు పరిశ్రమ కొద్దిగా షేక్ అయ్యింది. కానీ నాలుగేళ్ల క్రితం ఇది జరిగితే బావుండేది. చాలా మంది మహిళలు బ‌య‌ట‌ప‌డి ఉండేవారు. నివేదికను విడుదల చేయడానికి సిద్ధంగా లేనప్పటికీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టక తప్పలేదు.. అది నా భావన`` అని తెలిపారు.

కమిటీ నివేదిక ఆధారంగా WCC ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అనే ప్ర‌శ్న‌కు స్పందిస్తూ..

మేము నివేదికను అధ్యయనం చేస్తున్నాం. సినిమా ప్రవర్తనా నియమావళిపై పని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేము కూర్చుని మొత్తం నివేదికను చదువుతున్నాం. దాని నుండి సిఫార్సులను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పరిశ్రమ ఏం చేయగలదు..ఏం చేయ‌లేదు! ప్రభుత్వం ఏమి చేయాలి? అనేదానిపై మేము పని చేస్తున్నాము. ఆ వివరాలను ప్రభుత్వానికి, పరిశ్రమలకు అందజేస్తాం. మేము కూడా ఆ చర్చలో భాగమవుతాము. స‌మ‌స్య‌లో ఉన్న వారిని బ‌య‌ట‌కు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం! అని తెలిపారు.

ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే ఉమెన్ ఇన్ క‌లెక్టివ్ (డ‌బ్ల్యూ సీసీ) ప్ర‌తిపాద‌న‌ల‌ను ఇరుగు పొరుగు భాష‌ల‌కు విస్త‌రిస్తారా? టాలీవుడ్, కోలీవుడ్, శాండ‌ల్వుడ్ కి అనువ‌ర్తిస్తారా? అంటూ చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే మంచు విష్ణు, విశాల్ స‌హా ప‌లువురు ఇలాంటి వాటిపై ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. తెలుగు-త‌మిళ‌ చిత్ర‌సీమ‌ల్లోను మార్పును ఆహ్వానించారు. అందువ‌ల్ల ఉమెన్ ఇన్ క‌లెక్టివ్ సిఫార్సుల‌ను ఇక్క‌డ అనువ‌ర్తిస్తార‌నే భావిస్తున్నారు.

Tags:    

Similar News