RAM చూశాక ఆ రేంజ్ ఫీలింగ్ వస్తుంది.. చరణ్ తో నటించా: సూర్య
ఈ చిత్రంతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
రామ్ (RAM- ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అంటూ మంచి దేశభక్తి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యంగ్ హీరో సూర్య అయ్యలసోమయాజుల. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓఎస్ఎం విజన్ తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తాజాగా మీడియాతో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు హీరో సూర్య.
"చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. తేజ తీసిన కేక చిత్రంలో నటించాను. ఆ తర్వాత కుటుంబ సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. మళ్లీ ఇప్పుడు సినీ కెరీర్‌ను ప్రారంభించాను. కరోనా టైంలోనే మూవీస్ కోసం ఆడిషన్స్ ఇస్తూ వచ్చాను. అలా గేమ్ చేంజర్ సినిమాలో కూడా అవకాశం రావడంతో నటించాను. కేక మూవీ సినిమాకు మిహిరామ్ అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ పరిచయంతోనే ఈ కథ నా వద్దకు వచ్చింది. మిహిరామ్ తో నాది పది, పదిహేనేళ్ల అనుబంధం. ఆయన తన కథలు పట్టుకుని ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతుండేవారు. అలా మా ఇద్దరి జర్నీ ఈ రామ్ సినిమాతో ప్రారంభం అయింది" అని తన సినిమా జర్నీ తెలియజేశారు.
"రామ్ సినిమాకు ఆర్థిక కష్టాలు వచ్చాయి. ముందు వేరే నిర్మాత ఉండేవారు. కానీ ఆ తర్వాత మా ఫ్రెండ్స్ చిత్రాన్ని పూర్తి చేశాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారంతోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగాను. కో-డైరెక్టర్ సాయంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. చరణ్ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కెరీర్ స్టార్టింగ్ లోనే శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది" అంటూ సూర్య చెప్పుకొచ్చారు.
"నాకు చిన్నప్పటి నుంచి ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల మీద చాలా ఇంట్రెస్ట్. ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తుండేవాడ్ని. అందుకే ఈ సినిమాలో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయగలిగాను. ఎక్కడా కూడా డూప్ ను వాడలేదు. అన్నీ సొంతంగానే చేశాను. ఫైట్స్ సీక్వెన్స్ చేసిన టైంలో ఎన్నో గాయాలయ్యాయి. రామ్ చిత్రం ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉంటుంది. మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది. సోషల్ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ ఫార్మాట్ లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రామ్ మూవీని తెరకెక్కించాం. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది" అని తెలియజేశారు.
"రామ్‌లో చాలా మంది సీనియర్ నటులు యాక్ట్ చేశారు. సాయి కుమార్, భాను చందర్, శుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో నటించారు. సీనియర్లు అయినా సెట్స్‌లో వాళ్లంతా క్రమశిక్షణతో వ్యవహరించారు. వారితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. వారి నుంచి చాలా నేర్చుకున్నా. హీరోయిన్ ధన్య బాలకృష్ణ చాలా సపోర్ట్ చేశారు" అంటూ కొనియాడారు. మరి ఫస్ట్ మూవీ తో సూర్య హిట్ కొడతారో లేదో చూడాలి.