బిగ్ డిబేట్: ఎవరు నంబర్ -1 మెగా హీరో?
మెగా కుటుంబంలో అగ్ర హీరోలుగా చరణ్ - బన్ని ఇప్పటికి ఏల్తున్నారన్నది కాదనలేని వాస్తవం.
మెగా కుటుంబంలోనే కాకుండా ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలోనే తొలి జాతీయ ఉత్తమ నటుడిగా చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. అయితే ఈ సమయంలో అల్లు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు. ఇప్పుడు బన్నీనే మెగా కుటుంబంలో నం.1 హీరో అంటూ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని (లెగసీని) ముందుకు నడిపించే సిసలైన వారసుడు బన్ని అంటూ పొగిడేస్తున్నారు. అయితే దీనిని మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో స్పోర్టివ్ గా ఆస్వాధిస్తారు. బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ దక్కింది అనగానే తొలిగా పొంగిపోయింది మావయ్య చిరంజీవి. వెంటనే చిరు అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలిపారు. బన్ని ప్రతిభను ప్రశంసించారు.
ఇక చరణ్ తో బన్ని పోలిక సరైనది కాదు. చరణ్ కంటే బన్ని నటుడిగా సీనియర్. అయినా చరణ్ స్టార్ డమ్ లో తక్కువేమీ కాదు. ఆర్.ఆర్.ఆర్ స్టార్ గా ఇప్పుడు చరణ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ ని అందుకున్నాడు. ఫ్యాన్స్ రెండుగా చీలి విమర్శించుకున్నా ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అర్జున్.. రామ్ చరణ్ ఇద్దరూ పెద్ద స్టార్లు అనడంలో సందేహం లేదు. మునుముందు ఆ ఇద్దరి కలయికలో మల్టీస్టారర్లకు ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి ఆ ఇరువురి నడుమా ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. బన్ని పుష్ప ఫ్రాంఛైజీతో సత్తా చాటుతుండగా.. చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ గేమ్ ఛేంజర్ తో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గేమ్ ఛేంజర్ లో చరణ్ లోని రకరకాల కోణాల్ని శంకర్ బయటికి తీస్తున్నారు. భవిష్యత్ లో చరణ్ కూడా ఉన్నతమైన పురస్కారాల్ని అందుకునే జాబితాలో ఉన్నాడు.
ఇక హెచ్చు తగ్గులు ఒడిదుడుకులు ప్రయాణంలో సహజం. ఒకరు ఒకరోజు ఒక మెట్టు పైన ఉంటే ఇంకొకరు ఇంకో రోజు ఇంకో మెట్టు పైకి వెళుతుంటారు. చదరంగంలో ఎవరు ఎప్పుడు ఎలా ముందుకు వెళతారో ఎవరు కిందికి దిగిపోతారో తెలీదు. మెగా కుటుంబంలో అగ్ర హీరోలుగా చరణ్ - బన్ని ఇప్పటికి ఏల్తున్నారన్నది కాదనలేని వాస్తవం. అది ఫ్యాన్ వార్ లకు అతీతం. తెలుగు సినిమాని గర్వించే స్థాయికి తీసుకెళుతున్న ఇద్దరు మెగా హీరోలకు శుభాకాంక్షలు.
ప్రభాస్ - మహేష్‌తో పోటీపడి సాగాలి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత పెద్ద స్టార్లు అయినా కానీ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్న ప్రభాస్ తో .. పాన్ ఇండియా స్టార్ గా రికార్డులు కొట్టేందుకు సన్నాహకాల్లో ఉన్న మహేష్ తో పోటీపడాల్సి ఉంటుంది. మరోవైపు నందమూరి వంశం నుంచి అసాధారణ ప్రతిభావంతుడు ఎన్టీఆర్ తో వీళ్లంతా పోటీపడటం తప్పదు. ఇలా టాలీవుడ్ లో అరడజను మేటి ఎనర్జిటిక్ హీరోల నడుమ పోటీ ఎప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన పోటీతోనే మునుముందు టాలీవుడ్ మరో హాలీవుడ్ స్థాయికి ఎదుగుతుందనడంలో సందేహం లేదు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయే ధీరత్వం ఇప్పుడు మన హీరోలకు ఉందన్నది కాదనలేని నిజం.