చిరంజీవి బిగ్ బాంబ్.. తమ్ముడు పవన్‌కి పెద్ద బాధ్యత
బ్రహ్మానందం ప్రీరిలీజ్ వేడుకలో చిరు చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాంబ్ పేల్చారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన రాజకీయ వారసుడిగా పవన్ కల్యాణ్ కొనసాగుతారని పరోక్షంగా ప్రకటించారు. తన లక్ష్యాల్ని, సేవాభావాన్ని పవన్ కల్యాణ్ ప్రజలకు చేరుస్తారని కూడా మెగాస్టార్ వ్యాఖ్యానించారు. `బ్రహ్మానందం` ప్రీరిలీజ్ వేడుకలో చిరు చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది.
గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి భాజపాలో చేరుతున్నారని, ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సాన్నిహిత్యం పెరగడానికి ప్రత్యేక కారణాలున్నాయని, చిరును ఒక రాష్ట్రానికి గవర్నర్ ని చేసేందుకు పావులు కుదుపుతున్నారని, పవన్ కల్యాణ్ ఎన్డీయే అలయెన్స్ లో ఉన్నందున తెరవెనక చాలా మంత్రాంగం నడుస్తోందని కథనాలొస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ సైతం మెగాస్టార్ రాజకీయాల్లో రీయాక్టివ్ అవుతారని, తమ పార్టీతో కలిసి నడుస్తారని భావించింది.
కానీ ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ఊహాగానాలకు భిన్నమైన ప్రకటన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుంచి వెలువడింది. ఆయన ఇక రాజకీయాల్లోకి వచ్చేదే లేదని కుండబద్ధలు కొట్టారు. తన వారసుడిగా పవన్ కల్యాణ్ మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్ఠతనిచ్చారు. రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ లో చేరేందుకేనని ప్రచారం సాగుతోందని, కానీ సినీరంగానికి అవసరమైన వాటి కోసం మాత్రమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని చిరు అన్నారు. అంతేకాదు జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని, కళామతల్లి సేవకే అంకితమవుతానని చిరు పెద్ద ప్రకటన చేసారు.
నేను ఇక రాజకీయాల్లో ఉండను. నేను అనుకున్న విధంగా రాజకీయాల్లో సేవలు చేసేందుకు పవన్ కల్యాణ్ ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి చాలా స్పష్ఠంగా ప్రకటించారు. పరోక్షంగా పవన్ తన వారసుడు అని ప్రకటించేశారు. మొత్తానికి మెగాస్టార్ పెద్ద బాంబ్ పేల్చారు.. పవన్ కల్యాణ్ కి పెద్ద బాధ్యతను అప్పగించారని ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో మెగాస్టార్ పూర్తిగా సినీరంగంలో నటుడిగా కొనసాగుతారని, వరుస చిత్రాలలో నటిస్తూ తమను అలరించేందుకు అంకితమయ్యారని అభిమానులు ఆనందిస్తున్నారు.