కంగువతో తమిళ ఇండస్ట్రీ గెట్ బ్యాక్ అవుతుందా?
తెలుగు వాళ్లకు 'బాహుబలి' & కన్నడిగులకు 'కేజీఎఫ్' ఎలాగో.. తమిళ చిత్ర పరిశ్రమకు "కంగవ" సినిమా అలా అని మేకర్స్ చెబుతూ వస్తున్నారు.
తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టడం మొదలుపెట్టిన తర్వాత, 1000 కోట్ల క్లబ్ అనేది ఇండియన్ సినిమాకి బెంచ్ మార్క్ గా మారిపోయింది. ఒకప్పుడు 500 కోట్లు వస్తే చాలని భావించేవారు కానీ, ఇప్పుడు మాత్రం 1000 మిలియన్స్ వసూళ్లను టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ ఇండస్ట్రీలు ఈ ఫీట్ ను సాధించాయి. తమిళ ఇండస్ట్రీ మాత్రం ఈ విషయంలో వెనుకబడి పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలకు సిద్ధమైన 'కంగువ' సినిమా మైల్ స్టోన్ మార్క్ ను టచ్ చేస్తుందనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ "కంగువ". స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాయి. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. నవంబరు 14న తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే సొంత ఇండస్ట్రీ నుంచే ఈ చిత్రం ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలుస్తోంది.
తెలుగు వాళ్లకు 'బాహుబలి' & కన్నడిగులకు 'కేజీఎఫ్' ఎలాగో.. తమిళ చిత్ర పరిశ్రమకు "కంగవ" సినిమా అలా అని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. 1000 కోట్లు కాదు, 2 వేల కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఈ సినిమాకి ఉందని హైప్ ఎక్కించారు. దీనికి తగ్గట్టుగానే అన్ని భాషల్లోనూ ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. నిర్మాత ఎక్స్ పెక్ట్ చేసినంత రాకపోయినా, కోలీవుడ్ కు మొదటి వెయ్యి కోట్ల మూవీ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఈ ఫీట్ సాధించడానికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ చిత్రానికి సహకారం అందడం లేదు.
'కంగువ' సినిమాకి తమిళనాడులో అధిక సంఖ్యలో థియేటర్లు లభించడం లేదు. దీపావళికి రిలీజైన 'అమరన్' మూవీ మూడో వారంలో ఎంటర్ అవుతున్న కారణంగా, సూర్య సినిమాకి తక్కువ స్క్రీన్లు దొరికే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద 50% మాత్రమే థియేటర్లు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ భారీ కెపాసిటీ ఉన్న స్క్రీన్‌లను శివకార్తికేయన్ సినిమాకి కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'కంగువ' టీమ్ 1000 కోట్ల వసూళ్లతో, తమిళ సినిమాని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది జరగాలంటే భారీ ఓపెనింగ్స్ రాబట్టాలి. ఇందుకు ఎక్కువ స్క్రీన్లు అవసరం అవుతాయి. కానీ ఇక్కడ చూస్తే తగినన్ని థియేటర్లు దొరికేలా కనిపించడం లేదు. ఈ విషయంలో స్వంత ఇండస్ట్రీ నుంచి పెద్దగా మద్దతు లేదనే మాట వినిపిస్తోంది. అదే తెలుగులో అయితే 'బాహుబలి' కోసం మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తన చిత్రాన్ని వాయిదా వేసుకొని, తెలుగు సినిమాకి సపోర్ట్ గా నిలిచారు. ఇప్పుడు కంగువ చిత్రానికి ఇదే కొరవడుతోంది.
నిజానికి 'కంగువ' మూవీని దసరా సీజన్ లోనే రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. రజనీకాంత్ 'వేట్టైయాన్' కోసం సూర్య తన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు. కానీ అది ఫ్లాప్ చిత్రంగా మారడంతో మంచి డేట్ వేస్ట్ అయింది. సర్లే అని ఇప్పుడు నవంబరులో వస్తుంటే, రెండు వారాల థియేట్రికల్ రన్ కంప్లీట్ అవుతున్న సినిమా పోటీకి వస్తోంది. ఇదంతా చూస్తుంటే, కోలీవుడ్ లో టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ ఇంకా ₹1000 కోట్ల గ్రాసర్ సాధించకపోవడానికి పరస్పర మద్దతు లేకపోవడం ఒక కారణమని అర్థమవుతోంది.
'కంగువ' సినిమాకి నార్త్ సర్క్యూట్స్ లోనూ మంచి క్రేజ్ ఉంది. దిశా పటానీ, బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ నటించటం ఈ చిత్రానికి కలిసొచ్చింది. తెలుగులోనూ సూర్య మూవీకి మంచి బజ్ ఉంది. యూవీ క్రియేషన్స్ ఆంధ్రాలో ఓన్ గా రిలీజ్ చేస్తుంటే, నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారు. కాబట్టి తెలుగులో గ్రాండ్ రిలీజ్ దొరికే ఛాన్స్ ఉంది. తమిళ్ లో కూడా ఇలాంటి మద్దతు లభిస్తే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ ఓపెనింగ్స్ పెడుతుంది. మరి ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.