ప్రొడ్యూసర్ పై అలా పోస్ట్.. రైటర్ పై సీరియస్ రియాక్షన్?
రాజసింహ తడినాడ.. తెలుగు సినిమా రచయితగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే
రాజసింహ తడినాడ.. తెలుగు సినిమా రచయితగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. దాదాపు 60 సినిమాలకు పైగా రైటర్ గా పనిచేశారు. దర్శకుడిగా కూడా నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల ఓ నిర్మాతపై బహిరంగంగా తన కోపాన్ని ప్రదర్శించారు రాజసింహ. ఫేస్ బుక్ లో ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ నిర్మాత కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిభొట్ల) ఫొటో షేర్ చేస్తూ.. ఒక బ్రోకర్ ఎంత వివేకవంతుడైనా బ్రోకరే.. అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. పలు తెలుగు సినిమాలకు పనిచేసిన ఓ కథా రచయిత.. ఇలా నిర్మాతపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఇప్పుడు వివేక్ కూచిభొట్ల స్పందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో వివేక్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వివేక్ కూచిభొట్లకు రైటర్ రాజసింహతో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందట. అయితే గత కొంతకాలంతా వివేక్ వద్దకు తాను రాసుకున్న స్టోరీలను చెప్పడానికి రాజసింహ వెళ్తున్నారట. ఆ స్టోరీల విషయంలో ఇటీవలే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. దీంతో వివేక ఫ్యామిలీ మెంబర్స్ కు రాజసింహ అసభ్యకరమైన మెసేజ్ లు పంపించారట.
ఇటీవలే సోషల్ మీడియాలోనూ అసభ్యకర పదజాలంతో రాజసింహ పోస్ట్ పెట్టడంతో వివేక్ కూచిభొట్ల పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనతోపాటు దర్శకుడు రాఘవేంద్రరావు, వీఎన్ ఆదిత్య, వైవీఎస్ చౌదరిలను కూడా దూషిస్తూ రాజసింహ మెసేజ్ లు పెట్టారని వివేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రుద్రమదేవి సినిమాకు డైలార్ రైటర్ గా రాజసింహ పనిచేశారు. బన్నీ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రకు ఆయన రాసిన డైలాగులు అప్పుడు ఫుల్ పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ తో ఒక అమ్మాయి తప్ప అనే మూవీని తెరకెక్కించి దర్శకుడిగా మారారు. కానీ ఈ మూవీ మెప్పించలేకపోయింది.
కొన్నిరోజుల క్రితం, వ్యక్తిగత కారణాలతో రాజసింహ సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి పెద్దగా కనిపించడం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ సినిమా ఛాన్స్ కోసం వివేక్ వద్దకు వెళ్లిన రాజసింహ.. తనకు అవకాశం రాకపోయేసరికి ఇలా అక్కసు వెళ్లగక్కారన్నది ఇన్ సైడ్ టాక్.