టైగర్ (Vs) పఠాన్.. షాకిచ్చిన నిర్మాత నిర్ణయం!
ఇద్దరు ఖాన్‌లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే బాక్సాఫీస్ షేకవుతుందని "పఠాన్" నిరూపించింది. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రతో షారూఖ్ చాలా లాభపడ్డాడు
ఇద్దరు ఖాన్‌లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే బాక్సాఫీస్ షేకవుతుందని "పఠాన్" నిరూపించింది. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రతో షారూఖ్ చాలా లాభపడ్డాడు. అయితే అదే సీన్ ని రిపీట్ చేయాలని చూసిన టైగర్ 3 మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోవడం నిరాశపరిచింది. కింగ్ ఖాన్ షారూఖ్ నిడివి ఉన్న అతిథి పాత్రలో నటించినా కానీ టైగర్ 3 బంపర్ హిట్ కొట్టలేకపోయింది. ఈ సినిమా వసూళ్లు తీవ్రంగా నిరాశపరిచాయి.
దీంతో సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కాల్సిన టైగర్ వర్సెస్ పఠాన్ ఆలస్యమవుతోందని కథనాలొస్తున్నాయి. సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ జంటగా నటించిన YRF స్పై యూనివర్స్ మూవీ టైగర్ 3 ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ వద్ద పేలవంగా తేలిపోవడం ఊహించని ఝలక్. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మంచి ఓపెనింగులను రాబట్టినప్పటికీ చివరివరకూ హవా సాగించలేకపోయింది. చివరికి టైగర్ ఫ్రాంచైజీలోని ఇతర చిత్రాల కంటే తక్కువ వసూళ్లతో సరిపెట్టుకుంది. దీనివల్ల YRF సంస్థ సందిగ్ధంలో పడింది. ఈ బ్యానర్ నుంచి మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ చిత్రం టైగర్ Vs పఠాన్ ని ఆలస్యంగా సెట్స్ పైకి తీసుకెళ్లనుందని తెలుస్తోంది.
నిజానికి ఈ భారీ చిత్రం మార్చి 2024లో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే టైగర్ 3 ఫలితం కారణంగా ఇది మరింత ఆలస్యమవుతోంది. చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా స్క్రిప్ట్ నాణ్యతను మెరుగుపరచడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. కొన్ని బాలీవుడ్ మీడియాల కథనాల ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 2024 నుండి సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి షారుక్ ఖాన్ తన ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్‌లను పూర్తి చేశాడు. అతడు తదుపరి సినిమా గురించి ఆలోచించకుండా, తన కుమార్తె సుహానా ఖాన్ తొలి చిత్రం ప్రచారంపై ఫోకస్ పెట్టాడు. ది ఆర్చీస్ తో సుహానా ఘనమైన ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
మరోవైపు సల్మాన్ ఖాన్ వరుస చిత్రాలపై ఫోకస్ చేసారు. ప్రస్తుతం బిల్లా ,షేర్షా చిత్రాల ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో "ది బుల్" సినిమా కోసం పనిచేస్తున్నారు. తదుపరి తనను మునుపటి కంటే కొత్తగా ఆవిష్కరించే దర్శకుడి కోసం అతడు ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. అయినా కానీ "టైగర్ Vs పఠాన్" కోసం ఇద్దరు స్టార్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు ఖాన్ ల కలయికలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై సహజంగానే ఆసక్తి నెలకొంది. కాస్త ఆలస్యమైనా కానీ, దీనిపై జనంలో క్రేజ్ ఉంది. టైగర్ 3 వైఫల్యం ఈ కొత్త ప్రాజెక్టును వెంటాడుతుందని కూడా ఎవరూ భావించడం లేదు. అయితే గ్యాప్ ఇవ్వడం ద్వారా తిరిగి బాక్సాఫీస్ మ్యాజిక్ కోసం నిర్మాత ఆదిత్యా చోప్రా ఎత్తుగడను అనుసరిస్తున్నారని అర్థం చేసుకోవాలి.