'జీబ్రా' మూవీ రివ్యూ
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి.. హీరోగా ఎదిగిన టాలెంటెడ్ యాకర్ట సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం.. జీబ్రా.
'జీబ్రా' మూవీ రివ్యూ
నటీనటులు: సత్యదేవ్-డాలీ ధనంజయ-ప్రియ భవానీ శంకర్-సత్యరాజ్-సునీల్-సత్య-అమృత అయ్యంగార్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్
ఛాయాగ్రహణం: సత్య పొన్మార్
నిర్మాతలు: బాలసుందరం-ఎస్.ఎన్.రెడ్డి-దినేష్ సుందరం
రచన-ఈశ్వర్ కార్తీక్-యువ-మీరాఖ్
దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి.. హీరోగా ఎదిగిన టాలెంటెడ్ యాకర్ట సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం.. జీబ్రా. తెలుగు నుంచి సునీల్-సత్య.. కన్నడ నుంచి డాలీ ధనంజయ.. తమిళం నుంచి ప్రియ భవానీ శంకర్-సత్యరాజ్.. ఇలా సకల భాషల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంకులో ఉద్యోగి. బ్యాంకింగ్ సిస్టంలో లొసుగులన్నీ తెలిసిన అతను.. ఏదైనా సమస్య వచ్చినపుడు ఆ లొసుగుల్ని వాడుకుని దాన్నుంచి బయటపడుతుంటాడు. అతను ప్రేమించిన అమ్మాయి స్వాతి (ప్రియ భవాని శంకర్) కూడా మరో బ్యాంకులో ఉద్యోగే. ఆమె చేసిన ఒక పొరపాటు వల్ల 4 లక్షల రూపాయలు వేరే అకౌంటుకి వెళ్లిపోతే.. సూర్య తన స్టయిల్లో ఆ 4 లక్షలు వెనక్కి వచ్చేలా చేస్తాడు. కానీ సూర్య తొక్కిన అడ్డదారి తనకు చాలా పెద్ద సమస్యే తెచ్చి పెడుతుంది. చాలా ప్రమాదకరమైన మాఫియా డాన్ అయిన ఆది (డాలీ ధనంజయ)కు 5 కోట్లు రూపాయలు కట్టాల్సిన స్థితిలో పడతాడు సూర్య. నాలుగు రోజుల్లో ఆ డబ్బులు కట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అర్థమవడంతో ఆ డబ్బులు సంపాదించే పనిలో పడతాడు. కానీ ఈ క్రమంలో అతను ఇంకా ఇంకా సమస్యల్లో కూరుకుపోతాడు. ఇంతకీ ఈ ఐదు కోట్ల గొడవేంటి.. సూర్యను చిక్కుల్లో పడేసిందెవరు.. దీన్నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఏదైనా ఒక జానర్లో ఒక బెంచ్ మార్క్ లాంటి సినిమా వచ్చాక.. మళ్లీ అలాంటి కథలతో సినిమాలు వస్తే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కష్టం. ముందు వచ్చిన సినిమాతో పోల్చి చూసి.. కంటెంట్ ఏమాత్రం తగ్గినా ఆడియన్స్ పెదవి విరుస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగులను ఔపాసన పట్టిన హీరో.. ఆ నైపుణ్యంతో ఆడే ఆట నేపథ్యంలో ఇటీవలే 'లక్కీ భాస్కర్' అనే సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. యాదృచ్ఛికంగా ఈ సినిమా తెరకెక్కిన సమయంలోనే రూపొందిన 'జీబ్రా'లోనూ ఆ కథ ఛాయాలు చాలా కనిపిస్తాయి. ఇందులో కూడా హీరో బ్యాంకు ఉద్యోగే. అతనూ బ్యాంకింగ్ సిస్టంలో లోపాల్ని ఉపయోగించుకుని పెద్ద గేమ్ ఆడతాడు. ఈ క్రమంలో పావులా మారతాడు. పెద్ద సమస్య అతణ్ని చుట్టుముడుతుంది. దాన్నుంచి అతనెలా బయటపడ్డాడనే నేపథ్యంలో కథ నడుస్తుంది. ఐతే కథ పరంగానే కాక సన్నివేశాల్లోనూ 'లక్కీ భాస్కర్'తో పోలిక కనిపించే 'జీబ్రా' దానికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయింది. ఏదో చెప్పాలని.. ఏదేదో చేసేయాలని చాలా పాత్రలు పెట్టేసి.. అనేక లేయర్లుండేలా కథను తయారు చేసుకున్నారు కానీ.. ఆ కథను కుదురుగా చెప్పడంలో ఫెయిలవడంతో 'జీబ్రా' ఎంగేజ్ చేయలేకపోయింది.
'జీబ్రా'లో సత్యదేవ్ హీరోనే కానీ.. కథంతా అతడి మీదే నడవదు. దానికి సమానమైన చాలా పాత్రలు ఇందులో కనిపిస్తాయి. 'పుష్ప' ఫేమ్ డాలీ ధనంజయకు హీరోను మించిన ఎలివేషన్ ఇచ్చారు. సునీల్ వెరైటీ గెటప్-క్యారెక్టర్లో కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల అటెన్షన్ రాబడతాడు. 'మత్తు వదలరా-2'తో మెరుపులు మెరిపించిన సత్య తనదైన శైలిలో నవ్వులు పంచుతాడు. సత్యరాజ్ క్యామియో తరహా పాత్రలో బాగానే మెరిశాడు. ఇలా ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎక్కువ కనిపిస్తాయి కానీ.. ఆయా పాత్రలను ఎలివేట్ చేసే క్రమంలో కథ పక్కదారి పట్టేసింది. ఆరంభం హడావుడిగా.. గజిబిజిగా సాగే నరేషన్.. లాజిక్ కు అందకుండా కన్వీనియెంట్ గా సాగిపోయే సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. కథ పరుగులు పెడుతుంటుంది కానీ.. దాన్ని క్యాచ్ చేయడంలో మాత్రం ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. డాలీ ధనంజయ పాత్రను తీర్చిదిద్దిన విధానం చూస్తే అసలీ పాత్ర ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది అర్థం కాదు. ఓవైపు వందల కోట్ల డీల్స్ చేసే అతను.. ఐదు కోట్ల కోసం పట్టుబట్టి కూర్చోవడం సరైన లాజిక్ కనిపించదు. తన బ్యాక్ స్టోరీ అంతా కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
'జీబ్రా' కథలో అనేక లేయర్లు కనిపిస్తాయి. అంత సులువుగా అర్థం అయ్యే కథ కాదిది. చివరికి వచ్చే వరకు ప్రేక్షకులను ఒక గందరగోళంలోనే ఉంచేలా కొంచెం గజిబిజిగా కథను నరేట్ చేశాడు దర్శకుడు. కొన్ని పాత్రలు.. సీన్లు చూస్తే అసలీ కథతో ఏం చెప్పదలుచుకున్నారనే అయోమయం కలుగుతుంది. చివర్లో కొంచెం కథను రక్తి కట్టించే ప్రయత్నం జరిగింది కానీ.. అంతకుముందున్న గందరగోళాన్ని మరిపించే స్థాయిలో మాత్రం లేదు. బ్యాంకింగ్ సిస్టంలో లొసుగుల్ని ఉపయోగించుకుని హీరో గేమ్ ఆడే సీన్లు ప్రేక్షకులను కొంత ఎంగేజ్ చేస్తాయి. ఐతే అవి థ్రిల్లింగ్ గా అనిపించినప్పటికీ.. లూజ్ ఎండ్స్ తో వదిలేయడం వల్ల లాజికల్ గా అనిపించవు. బ్యాంకులో అందరినీ బురిడీ కొట్టించి రెండున్నర కోట్లు కొట్టేసే ఎపిసోడ్ ఒకటి సినిమాలో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే ఆ ఎపిసోడ్ కూడా చాలా కన్వీనియెంట్ గా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. వేరే సీన్లు కూడా ఇలాగే తయారయ్యాయి. 'లక్కీ భాస్కర్' చూసిన వాళ్లు అందులోని సన్నివేశాలతో వీటిని పోల్చుకుని కచ్చితంగా పెదవి విరుస్తారు. సినిమాలో ప్రతి పాత్రా ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది. కానీ ఎవరి గేమ్ ఏంటో అర్థం చేసుకోవడమే కష్టమవుతుంది. హీరో పాత్రకు సరైన లక్ష్యాన్ని నిర్దేశించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. తన పాత్ర ఒక్కోసారి ఒక్కోరకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కథలో మలుపులకు లోటు లేదు కానీ.. ఆ మలుపులు లాజికల్ గా అనిపించవు. థ్రిల్లర్ సినిమాను రెండు ముప్పావు గంటల నిడివితో తీయడం పెద్ద మైనస్. అవసరం లేని సీన్లు చాలా ఉన్నాయిందులో. అక్కడక్కడా కొన్ని సీన్ల వరకు ఓకే అనిపించినా.. ఓవరాల్ గా 'జీబ్రా' మెప్పించలేకపోయింది.
నటీనటులు:
సూర్య పాత్రలో సత్యదేవ్ చాలా సిన్సియర్ గా నటించాడు. ఆరంభం నుంచి చివరి వరకు తన పాత్రలో.. నటనలో ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. తన లుక్.. బాడీ లాంగ్వేజ్ పాత్రకు బాగా సరిపోయాయి. ఆద్యంతం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా నటించాడు సత్యదేవ్. హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ ఓకే. హీరో కాని హీరో పాత్రలో డాలీ ధనంజయ ఆకట్టుకున్నాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వాయిస్ తనకు అసెట్. కానీ ఆ పాత్రకు విపరీతమైన బిల్డప్ ఇచ్చి ప్రేక్షకులను విసిగించారు. సత్యరాజ్ కొంచెం క్రేజీగా అనిపించే పాత్రలో కాసేపు ఎంగేజ్ చేశాడు. సీరియస్ గా సాగే సినిమాలో సత్య కామెడీ పెద్ద రిలీఫ్. 'మత్తు వదలరా-2' ఫామ్ ను కొనసాగిస్తూ అతను కనిపించిన ప్రతిసారీ నవ్వించాడు. సునీల్ వెరైటీ పాత్రలో కొత్తగా కనిపించాడు. తన లుక్.. మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గరుడ రామ్ చివర్లో వచ్చి కాసేపు మెరిశాడు. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
'జీబ్రా'కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఏరి కోరి అతణ్ని పెట్టుకున్నందుకు అతను బాగానే న్యాయం చేశాడు. సినిమా రేసీగా అనిపించేలా బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఫ్లోతో సాగుతుంది. పాటలకు ఇందులో ప్రాధాన్యం లేదు. సత్య పొన్మార్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమాలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. సత్యదేవ్ హీరోగా నటించిన మరే చిత్రంలో ఈ స్థాయి నిర్మాణ విలువలు కనిపించవు. రైటర్ కమ్ డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్.. యువ-మీరాఖ్ లతో కలిసి అందించిన కథలో విషయం ఉంది. అంత తేలిగ్గా చెప్పగలిగే కథ కాదు ఇది. కానీ దీన్ని నరేట్ చేయడంలో కార్తీక్ తడబడ్డాడు. ప్రేక్షకులను తీవ్ర గందరగోళానికి గురి చేశాడు. అక్కడక్కడా కొన్ని సీన్లలో మినహాయిస్తే అతను మెప్పించలేకపోయాడు.
చివరగా: గజిబిజి కథలో కొన్ని మెరుపులు
రేటింగ్ - 2.5/5