పానీపూరీ కోసం సబ్ స్క్రిప్షన్... రూ.1 - రూ.99,000 ప్లాన్స్ మీకోసం!

ఇందులో భాగంగా... రకరకాల ఆఫర్స్ తో పానీ పూరీ తినడానికి సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకొచ్చాడు.

Update: 2025-02-15 13:05 GMT

సాధారణంగా ఓటీటీలకు సబ్ స్క్రిప్షన్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే.. ఇక మెట్రో పాస్ ల వంటి వాటిని రీఛార్జ్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే.. రొటీన్ కి భిన్నంగా ఆలోచించాడు ఓ పానీ పూరీ వ్యాపారవేత్త. ఇందులో భాగంగా... రకరకాల ఆఫర్స్ తో పానీ పూరీ తినడానికి సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకొచ్చాడు. నెట్టింట ఇప్పుడి విషయం ఆసక్తిగా మారింది.

అవును... చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ చాలా మంది పానీపూరీ చూసి లొట్టలేస్తుంటారు! ఎంత బిజీగా ఉన్నా ఆ బండి చూడగానే వీరి బండి ఆగిపోతుంటుందని చెబుతుంటారు. ఆ స్థాయిలో పానీపూరీకి ఫ్యాన్స్ ఉంటారని అంటారు. ఈ సమయంలో తాజాగా అలాంటీ పానీపూరీ ప్రియుల కోసం సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకొచ్చి రకరకాల ప్లాన్స్ తీసుకొచ్చాడో వ్యాపారి.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన పానీపూరీ వ్యాపారి విజయ్.. వీటి అమ్మకాల విషయంలో ఓ అడుగు ముందుకేశాడు. తాను అమ్మే పానీపూరీలకు సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు ప్రకటించాడు. ప్రతీసారి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఓ సరికొత్త ఆలోచన చేశాడు. ఇందులో రూ.1 నుంచి రూ.99,000 వరకూ ప్లాన్స్ ఉండటం గమనార్హం.

ఇందులో భాగంగా... ఎవరైనా జీవితాంతం ఉచితంగా, ఎప్పుడంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని పానీపూరీలు తినాలంటే.. ఆ ప్లాన్ కోసం రూ.99,000 చెల్లించాలని పేర్కొన్నాడు. పానీపూరీ కోసం అంత చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకుంటారా..? అని అనుకుంటే పొరబడినట్లే.. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఆ ప్లాన్ తీసుకున్నారంట!

ఆ బిగ్ ప్లాన్ సంగతి అలా ఉంటే.. మరికొన్ని ఆసక్తికర ఆఫర్లు తీసుకొచ్చాడు విజయ్. ఇందులో భాగంగా... "మహా కుంభ్" పేరుతో రు.1 ఆఫర్ పెట్టారు. అయితే.. దీనిలో చిన్న కండిషన్ ఉంది. ఎవరైనా వ్యక్తి వరుసపెట్టి ఒకే దఫాలో 40 పానీపూరీలు తినగలిగితే వాళ్లు రు.1 చెల్లిస్తే సరిపోతుందట. తినలేకపోతే.. అప్పటివరకూ తిన్నవాటికి చెల్లించాలన్నమాట!

ఇక వీటిలో మహిళలకు ప్రత్యేకమైన ప్లాన్ కూడా ఒకటి ఉంది. ఇందులో భాగంగా... లాడ్లి బెహెన్ యోజన ప్లాన్ కింద పానీపూరీ తినడానికి వచ్చిన మహిళలు రూ.60 చెల్లిస్తే ఎన్ని తినగలిగితే అన్ని తినొచ్చు. ఇదే సమయంలో ఈ పోటీలన్నీ ఎందుకులే అనుకుంటే.. రు.195 చెల్లిస్తే నెల మొత్తం అన్ లిమిటెడ్ పానీపూరీలు తినొచ్చంట.

మరి ఈ స్థాయిలో రూ.1 నుంచి రూ.99,000 వరకూ పెట్టిన ఈ పానీ పూరీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వ్యాపారి ఆలోచన సూపర్ అని ఒకరంటే... రూ.99,000 పెట్టి లైఫ్ లాంగ్ ఆప్షన్ తీసుకున్నవారిని చూసి పలువురు అయ్యో పాపం అని అంటుండటం గమనార్హం!

Tags:    

Similar News