ఉద‌యం 6 నుంచి రాత్రి 9 వ‌ర‌కు 'అలాంటి యాడ్స్' వ‌ద్దు: బ్రిట‌న్‌లో గ‌గ్గోలు

అయితే.. బ్రిట‌న్‌లో ఆహార ప‌దార్దాల‌కు సంబంధించిన యాడ్స్‌పై తాజాగా బ్రిట‌న్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది.

Update: 2024-12-06 05:41 GMT

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌క‌ట‌న రంగం దూసుకుపోతున్న స‌మ‌యం ఇది. సాంకేతిక విప్ల‌వాన్ని ప్ర‌క‌ట‌నల రంగం సంపూర్ణంగా వినియోగించుకుంటోంది. సృజ‌నాత్మ‌క‌త‌కు పెద్ద‌పీట వేసే ప్ర‌క‌ట‌న‌ల రంగంలో రాణిస్తే.. రాత్రికి రాత్రి కోటీశ్వ‌రులు కూడా అయిపోవ‌చ్చు. మ‌న దేశంలోనూ ప్ర‌క‌ట‌న రంగం బిలియ‌న్ డాల‌ర్ల‌లో ఆర్జిస్తోంది. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల రంగంపై బ్రిట‌న్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కీల‌కమైన ప్ర‌క‌ట‌న‌ల‌ను ఉద‌యం 6 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌సారం చేయొద్ద‌ని పేర్కొంది. ఇది యాడ్స్‌ మార్కెట్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

విష‌యం ఏంటి?

ఏ వ‌స్తువుకైనా ప్ర‌చారం కావాల్సిందే. వ‌స్తువే కాదు.. వ్యాపారానికి కూడా ప్ర‌క‌ట‌నే ప‌ర‌మావ‌ధిగా మారిపోయింది. దువ్వెన నుంచి రాత్రి ప‌డుకునే ప‌రుపుల వ‌ర‌కు.. ఏదైనాప్ర‌క‌ట‌నల ప్ర‌పంచంలో మ‌హ‌త్తే! ఆక‌ర్ష‌ణీయ ప్ర‌క‌ట‌న‌ల రంగంలో ఉపాధి, ఉద్యోగాలు కూడా బారీ ఎత్తున పెరుగుతున్నాయి. ఇక‌, ప్ర‌క‌ట‌న‌ల రంగంలో 60 శాతం వాటా.. ఆహార రంగానిదే కావ‌డం గ‌మ‌నార్హం. ఆహారం అంటే.. బిస్క‌ట్ల నుంచి వంట‌గ‌దిలో వాడే ఆవాల వ‌ర‌కు.. మంచి నూనెల నుంచి ష‌ర‌బ‌త్తుల వ‌ర‌కు, కూల్ డ్రింక్స్ నుంచి ఇత‌ర‌త్రా పానీయాల వ‌ర‌కు కూడా ప్ర‌క‌ట‌న‌ల‌కు కాదేదీ అన‌ర్హం అన్న‌ట్టుగా యాడ్స్ ప్ర‌పంచంలో దూసుకుపోతున్నాయి.

అయితే.. బ్రిట‌న్‌లో ఆహార ప‌దార్దాల‌కు సంబంధించిన యాడ్స్‌పై తాజాగా బ్రిట‌న్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. అయితే.. దీనికి ప‌ది మాసాల‌కు పైగానే స‌మ‌యం ఇచ్చింది. వ‌చ్చే ఏడాది అక్టోబ‌రు 25 నుంచి ఆహార ప‌దార్థాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల‌పై నిషేధం వర్తిస్తుంద‌ని స‌ర్కారు చెప్పింది. అయితే.. ఈ జాబితాలో ప్ర‌ధానంగా కూల్ డ్రింక్స్‌, బ‌ర్గ‌ర్లు, పిజ్జాలు, డీప్ ఫ్రై చేసిన ప‌దార్థాలు వెజ్‌, నాన్ వెజ్ స‌హా అన్నీ ఉన్నాయి. అంతేకాదు.. ఐస్ క్రీమ్ ప్ర‌క‌ట‌న‌ల‌పైనా నిషేధం విధించారు. ఉద‌యం 6 నుంచి రాత్రి 9 వ‌ర‌కు ఇన్ డోర్ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున గ‌గ్గోలు ప్రారంభ‌మైంది. ప్ర‌క‌ట‌నల రంగంలోని సుమారు 12 ల‌క్ష‌ల మంది ఉద్యోగాల‌పై ఈ నిర్ణ‌యం ప్ర‌భావం చూప‌తుంద‌న్న‌ది ఒక ఆవేద‌న అయితే.. స‌ద‌రు వ్యాపార సంస్థ‌లు మూత‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది మ‌రో ఆవేద‌న‌. దీంతో తీవ్ర‌స్థాయిలో గ‌గ్గోలు పుడుతోంది.

కార‌ణం ఏంటి?

ఇలా బ్రిట‌న్ ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డానికి కార‌ణం.. చిన్నారుల నుంచి పెద్ద పిల్ల‌ల వ‌ర‌కు.. కూడా ఊబ‌కాయం పెరిగిపోతుండ‌డ‌మే. దేశంలో ప్ర‌తి 10 మంది చిన్నారుల్లో ఒక‌రి నుంచి ఇద్ద‌రి వ‌ర‌కు ఊబ‌కాయంతో ఇబ్బంది ప‌డుతున్నారు. వ‌చ్చే 2030 నాటికి దేశ‌వ్యాప్తంగా ఊబ‌కాయులు పెరిగిపోతార‌న్న‌ది స‌ర్కారు అంచ‌నా. దీంతో ఊబ‌కాయానికి కార‌ణ‌మైన ఆయా ఆహార ప‌దార్థాల ప్ర‌క‌ట‌న‌ల‌పై నిషేధం విధించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ఆక‌ర్ష‌ణ త‌గ్గి.. వాటిని వినియోగించ‌డం మానేస్తార‌న్న‌ది స‌ర్కారు యోజ‌న‌. అయితే.. ఈ ప్ర‌యోగం కొండనాలిక‌కు మందేయాల‌ని చూసి.. ఉన్న‌నాలుక‌ను ఊడ‌గొట్టుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు నిపుణులు. అంటే ఉద్యోగ రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News