తాజా అధ్యయనం.. ఈ వ్యాధితో ఏడాదికి 97 లక్షల మంది బలి!

ముఖ్యంగా యువకులు బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు.

Update: 2023-10-11 23:30 GMT

ప్రస్తుతం మనదేశంలో గుండె జబ్బులతోపాటు బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో మరణించేవారి సంఖ్య పెరుగుతుండటం అందరిలో ఆందోళన నింపుతోంది. ముఖ్యంగా యువకులు బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో లాన్సెట్‌ న్యూరాలజీ జర్నల్‌ తన తాజా అధ్యయనంలో సంచలన విషయాలను వెల్లడించింది.

ప్రపంచంలో వచ్చే మూడు దశాబ్దాల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో మరణించే వారి సంఖ్య 50 శాతం పెరుగుతుందని లాన్సెట్‌ తాజా అధ్యయనం బాంబు పేల్చింది. 2050 నాటికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో మరణించేవారి సంఖ్య 50 శాతం పెరుగుతుందని హెచ్చరించింది. అలాగే మరణాల సంఖ్య కూడా ఏడాదికి 97 లక్షలకు చేరుకుంటుందని తన తాజా అధ్యయనంలో వెల్లడించింది.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వల్ల పెరుగుతున్న ఆరోగ్య, ఆర్థిక ప్రభావాలను లాన్సెట్‌ న్యూరాలజీ జర్నల్‌ అధ్యయనం విశ్లేషించింది. బ్రెయిన్‌ స్ట్రోక్‌ ల్లో ఎక్కువ తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయని వెల్లడించింది, ఇటీవల నమోదవుతున్న బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు, సర్వేలు, ప్రపంచవ్యాప్తంగా న్యూరాలజీ నిపుణులతో ఇంటర్వ్యూలు, సమీక్షల ఆధారంగా పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ కు గురై మృతి చెందినవారు, పక్షవాతానికి గురై బాధపడేవారి సంఖ్య గత 30 ఏళ్లలో రెట్టింపైందని లాన్సెట్‌ న్యూరాలజీ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ బాధితులు ఎక్కువ మంది ఉన్నారని గుర్తచారు.

2020లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ మరణాలు అత్యధికంగా ఆసియాలో 61 శాతం ఉండగా 2050 నాటికి 69 శాతానికి పెరుగుతాయని అధ్యయనం తెలిపింది.బ్రెయిన్‌ స్ట్రోక్‌ మరణాలను ఎదుర్కోవడానికి 12 సూచనలను చేసింది. ఈ మరణాల నివారణకు ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని తెలిపింది. ఇందుకోసం డిజిటల్‌ ప్రచారం, డిజిటల్‌ శిక్షణతో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించింది.

ముఖ్యంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ మరణాలను ఎదుర్కోవడానికి అవసరమైన వైద్యులు, సిబ్బందిని, మందులను, ఆస్పత్రుల్లో మౌలిక వసతులను పెంపొందించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సరైన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకుంటే బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అధ్యయనం తెలిపింది.

ఈ నేపథ్యంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రపంచ జనాభాపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఈ పరిశోధన చేసినవారిలో ఒకరైన ప్రొఫెసర్‌ వాలెరీ ఎల్‌ ఫీగిన్‌ చెప్పారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ ఏటా లక్షలాది మంది మరణానికి, శాశ్వత వైకల్యానికి కారణమవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా దీని చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News