కోవిడ్ కి ముందు నుంచీ వణికిస్తున్న వైరస్ ల గురించి తెలుసా?
సాధారణంగా ఈ తరం వారికి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి మాత్రమే అనుభవం ఉన్న పరిస్థితి.
సాధారణంగా ఈ తరం వారికి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి మాత్రమే అనుభవం ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో... తాజాగా చైనాలో పుట్టిన మరో మహమ్మారి హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్ఎంపీవీ) భారత్ లో కలకలం సృష్టించడం మొదలుపెట్టింది. అయితే.. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది.
కాకపోతే... గతానుభవాలను దృష్టిలో ఉంచుకున్న ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలు చెందుతున్నారని అంటున్నారు. ప్రధానంగా.. కోవిడ్ సమయంలోనూ మొదట్లో ఇలాంటి రియాక్షన్సే వచ్చాయని.. అయితే, అతి తక్కువ సమయంలో ఆ వైరస్ మొత్తం వ్యాపించి జీవితాలను తలకిందులు చేసేసిందని చెబుతున్నారు. స్వీయ రక్షణ చర్యలు చేపడుతున్నారు!
పైగా సరిగ్గా ఇదే సమయంలో మహా కుంభమేళా జరగనుండటం.. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 40 కోట్ల మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతుండటంతో... ఈ వైరస్ వ్యాప్తిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కరోనా కంటే ముందు నుంచీ ప్రపంచాన్ని అల్లల్లాడిస్తున్న 10 వైరస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...!
వాస్తవానికి ప్రపంచంలో కొన్ని లక్షల వైరస్ లు ఉంటాయని చెబుతారు. వీటి సంఖ్య 3.2 లక్షలు అని అంటారు. అయితే.. వీటిలో కొన్ని మాత్రమే అత్యంత ప్రమదకారమైనవి. ఇవి ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను హరించేస్తుంటాయి. వారి సంఖ్య సుమారు 15 మిలియన్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.
అలాంటి 10 వైరస్ ల వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
రోటా వైరస్:
శిశువులు, చిన్నపిల్లలలో అతిసార వ్యాధికి కారణమయ్యేవి ఈ రోటా వైరస్ లు. అందుకే వీటిని చైల్డ్ కిల్లర్ వైరస్ అని కూడా అంటారు. ప్రపంచంలోని దాదాపూ ప్రతీ బిడ్డ.. తనకు ఐదేళ్లు వచ్చే లోపు కనీసం ఒక్కసారైనా ఈ వైరస్ బారిన పడతారని చెబుతుంటారు. ఫలితంగా.. ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పిల్లలను ఈ వైరస్ బలి తీసుకుంటుందని అంటున్నారు. ఇది మల, నోటి మార్గాల ద్వారా వ్యాపిస్తుంది.
చికెన్ ఫాక్స్ (మశూచి):
మశూచి అనేది ఓ భయంకరమైన అంటువ్యాధి. చికెన్ ఫాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల ద్వారా వచ్చే ఈ చర్మ వ్యాధినే స్మాల్ ఫాక్స్, స్పోటకం, చిన్న అమ్మవారు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 50 కోట్ల మంది మరణించినట్లు చెబుతారు. అయితే... దీనికి సంబంధించిన వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో మశూచి కనిపించడం చాలా అరుదుగా మారింది.
తట్టు (మీజిల్స్):
తట్టు లేదా పొంగు అనే ఈ వ్యాధిని మిజిల్స్ అని పిలుస్తారు. ఈ అంటువ్యాధి ప్రధానంగా పిల్లలలో వస్తుంది. దీని కారణంగా గత 150 ఏళ్లలో సుమారు 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొందని చెబుతున్నారు. ఈ వ్యాధి క్రీ.పూ.600 సంవత్సరాల నుంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ శ్వాసతో పాటు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
డెంగ్యూ వైరస్:
ఈ డెంగ్యూ వైరస్ ఏడిస్ ఈజైప్టె అనే దోమల వల్ల వ్యాప్తిస్తుంది. ఈ వైరస్ ను ప్రపంచంలోని 110 దేశాలలో కనుగొన్నారు. ఇది ప్రతీ సంవత్సరం సుమారు 10 కోట్ల మందికి సోకుతుండగా.. వారిలో సుమారు 20 వేల మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఈ వైరస్ శరీరంలోని రక్త కణాలపై ప్రభావం చూపిస్తుంది!
ఎబోలా - మార్బర్గ్ వైరస్:
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాధకరమైన వైరస్ లలో ఈ ఎబోలా వైరస్ ఒకటి. వీటి నియంత్రణకు ఇంకా వ్యాక్సిన్ అభివృద్ధి చెందలేదు. ఈ రెండు వైరస్ ల లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ఇందులో భాగంగా... బాధితుడు రక్తస్రావం, అవయువ వైఫల్యం వంటి సమస్యల బారిన పడతాడు. ఈ వైరస్ ల మరణాలు రేటు 90 శాతం వరకూ ఉందని చెబుతుండటం గమనార్హం.
ఎయిడ్స్:
ఓ అంచనా ప్రకారం గడిచిన మూడు దశాబ్ధాల్లో ప్రతీ ఏటా సుమారు 20 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 2.5 కోట్ల మంది ఇప్పటివరకూ మృతి చెందారని అంటున్నారు. సుమారు నాలుగు కోట్ల మంది ఈ హెచ్.ఐ.వీ. వైరస్ బారినపడి ఉన్నారని అంటున్నారు.
సాధారణంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి, కాలుషిత సిరంజిల వాడకం వల్ల ఈ వైరస్ ప్రవేశిస్తుందని అంటారు. సాధారణంగా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కనీసం 3 నుంచి 6 నెలల వరకూ రక్త పరీక్షల ద్వార వైరస్ జాడ కనుగొనలేరని అంటున్నారు.
ఎల్లో ఫీవర్:
ఈ వైరస్ సోకిన బాధితుని ముక్కు, కళ్లు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతుంది! ఈ స్థితికి చేరుకున్న రోగుల్లో లివర్ దెబ్బతినడం వల్ల చర్మం పసుపు రంగులోకి మారుతుంద్ని చెబుతారు. ఈ స్థితికి చేరుకున్న రోగులలో 50 శాతం మంది వారం నుంచి 10 రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు. ఏడాదికి సుమారు 2 లక్షల మంది ఈ వైరస్ బారిన పడిన కేసులు ఉంటే.. వాటిలో 90 శాతం ఆఫ్రికాలోనే సంభవిస్తాయని చెబుతారు.
ఫ్లూ (ఇన్ ఫ్లుఎంజా):
ఇన్ ఫ్లుఎంజా వైరస్ వల్ల వచ్చే వ్యాధిని సాధారణంగా ఫ్లూ అని పిలుస్తారు. ఈ వైరస్ సోకిన పిల్లల్లో ముఖ్యంగా విరేచనాలు, వాంతులు సంభవిస్తాయని చెబుతారు. ఈ క్రమంలో ప్రతీ ఏటా జనాభాలో ఐదు నుంచి 15 శాతం మందికి ఈ ఫ్లూ సోకుతుందని.. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఈ ఫ్లూ కారణంగా మరణిస్తున్నారని చెబుతున్నారు.
రేబిస్:
గబ్బిలం లేదా కుక్క కాటు వల్ల వచ్చే అవకాశాలున్న ఈ రాబిస్ ను పురాతన కాలం నుంచీ ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఇది జంతువుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధి కూడా. ఈ వ్యాధి సోకిన జంతువులు మనిషిని కొరికినప్పుడు అది వారిలోకి వ్యాపిస్తుంది. ఇది నరాలు, మెదడుపై ప్రభావం చూపుతుందని అంటారు. ఈ వైరస్ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 వేల మంది మరణిస్తున్నారు.
హెపటైటిస్-బీ అండ్ సీ:
అత్యంత ప్రమాధకరమైన వ్యాధులలో ఒకటిగా నిలిచిన హెపటైటిస్ బీ వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగ సుమారు 7 లక్షల మంది మృతి చెందుతున్నారు. ఈ వైరస్ తొలుత కాలెయంపై దాడి చేస్తుంది. అయితే.. దీనికి తగిన చికిత్స ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని చెబుతున్నారు. ఇక హెపటైటిస్ - సి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.5 లక్షల మంది చనిపోతున్నారని అంటున్నారు.