తాజా రిపోర్టు.. కాఫీ.. టీ తాగితే ఆ క్యాన్సర్లకు చెక్!
అయితే.. ఇక్కడ పాయింట్ ఏమంటే.. సదరు అధ్యయన రిపోర్టు వందల పేజీల్లో ఉంటుంది.
అమెరికా క్యాన్సర్ సొసైటీకి చెందిన ‘క్యాన్సర్’ అనే జర్నల్ లో ప్రచురించిన విషయాన్ని చెప్పే ముందు.. ఒక అంశాన్ని ప్రస్తావించటం మా బాధ్యతగా భావిస్తున్నాం. కొన్ని అధ్యయనాలు.. వాటికి సంబంధించిన వివరాలు మీడియాలో చదువుతుంటాం. అయితే.. ఇందులోని విశ్వసనీయత ఎంతన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే.. ఒక అంశంపై ఒకసారి పాజిటివ్ గా చెప్పిన తర్వాత.. కొంతకాలానికి దానికి విరుద్ధమైన వాదనను వినిపిస్తూ అధ్యయనాలు రావటమే దీనికి కారణం. అయితే.. ఇక్కడ పాయింట్ ఏమంటే.. సదరు అధ్యయన రిపోర్టు వందల పేజీల్లో ఉంటుంది. అందులో ‘షరతులు వర్తిస్తాయి’ లాంటి పాయింట్లు ఉంటాయి.
కానీ.. విషయాన్ని చెప్పే ముందు.. అందరిని ఆకర్షించే పాయింట్ ను బేస్ చేసుకొని కథనాన్ని హైలెట్ చేస్తారు. కాబట్టి.. ఇప్పుడు మేం చెప్పే సమాచారాన్ని అవగాహన కోసం మాత్రమే తీసుకుంటే సరి. ఫలానా సొసైటీ ఫలానా తీరుతో చెప్పింది కాబట్టి.. ఇప్పటికే ఉన్న అలవాట్లను మార్చుకోవటం సరికాదు. అలా అని.. ఏదైనా సరే.. అతిగా వినియోగించటం సరికాదు. అధ్యయనానికి సంబంధించిన అంశాల్ని ఎవరికి వారు తమ సొంత విచక్షణకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పటం మా ధర్మమని భావిస్తున్నాం. అసలు విషయం ఏమంటే.. అమెరికాకు చెందిన క్యాన్సర్ సొసైటీ తాజాగా చేసిన అధ్యయనంలో టీ.. కాఫీలు తరచూ తాగే వారిలోతల.. మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు.
అంతేకాదు.. నోరు.. గొంతు.. స్వరపేటిక క్యాన్సర్ లను సైతం టీ.. కాఫీలు అరికట్టే వీలుందని వెల్లడిస్తున్నారు. ఇందుకోసం పద్నాలుగు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమాలజీ కన్సార్టియం ఈ అధ్యయనాలను నిర్వహించారు. 9500 మంది తల.. మెడ క్యాన్సర్ రోగులను పరీక్షించటంతో పాటు క్యాన్సర్ నుంచి బయటపడిన 15,700 మందిని సైతం అధ్యయనం చేసిన వారు.. నిత్యం కాపీ.. టీ తీసుకుంటున్న వారిలో మెడ.. తల క్యాన్సర్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం అసలు కాఫీ.. టీ తాగని వారితో పోలిస్తే.. రోజుకు నాలుగైదు కప్పుల కాఫీ తీసుకునే వారిలో 17 శాతం క్యాన్సర్ కారకాలు తగ్గుముఖం పడతాయని.. రోజు మొత్తంలో ఎక్కువ కాఫీ తీసుకునే వారిలో నోటి క్యాన్సర్ లక్షణాలు 30 శాతం తక్కువగా ఉంటే.. గొంతు క్యాన్సర్ కారకాలు 22 శాతం తక్కువగా ఉంటాయని తెలిపారు. నిత్యం 3-4 కప్పుల కాఫీ తాగే వారికి గొంతు కింద భాగంలో వచ్చే హైపోఫారింజీల్ క్యాన్సర్ లక్షణాలు 41 శాతం తక్కువగా ఉంటాయి.
అదే సమయంలో రోజుకు ఒక్క సారైనా టీ తాగే వారిలో 9 శాతం వరకు తల.. మెడ క్యాన్సర్ కారకాలు తక్కువగా ఉంటాయని.. అదే పనిగా టీ తాగినా ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఎక్కువగా టీ తాగే వారిలో హైపోఫారింజీల్ క్యాన్సర్ లక్షణాలు 38 శాతం ఎక్కువగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. సో.. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే మంచిది.