గుండె భద్రం.. అది ఎవరికైనా.. ఎంతటివారికైనా?
శాస్త్రీయంగా ఎంతవరకు సమర్థించగలమో లేదో తెలియదు కానీ.. కొవిడ్ వ్యాప్తి అనంతరం గుండె బాధితులు పెరిగారు.
మనిషి శరీరంలో అత్యంత కీలక అవయవం గుండె. మిగతా భాగాలు వేటికి ఇబ్బంది వచ్చినా సరిచేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, గుండెకు అలాకాదు. అసలు ప్రాణానికి చాన్స్ ఉండదు. అలాంటి గుండె ఇటీవలి కాలంలో తరచూ విఫలమవుతోంది. చిన్నాపెద్ద తేడా లేదు. హోదాతో సంబంధం లేదు.. ఆరోగ్యవంతులా.. అనారోగ్య పీడితులా అని కాదు.. ఇతర అలవాట్లు ఉన్నాయా లేదా? అని కాదు అందరికీ గుండె వైఫల్యం ఎదురవుతోంది.
కొవిడ్ దెబ్బతో మరింత ముప్పు
శాస్త్రీయంగా ఎంతవరకు సమర్థించగలమో లేదో తెలియదు కానీ.. కొవిడ్ వ్యాప్తి అనంతరం గుండె బాధితులు పెరిగారు. కొన్ని దేశాల్లో టీకాలు గుండెపోట్లకు కారణం అయ్యాయనే కథనాలు వచ్చాయి. వాటిని పక్కనపెడితే.. కొవిడ్ ప్రభావం మనిషి గుండెపై తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఆకస్మిక గుండె పోట్లు దీనినే సూచిస్తున్నాయని పేర్కొంటున్నారు. అందులోనూ సెకండ్ వేవ్ లో కొవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని.. ఆ సమయంలో వైరస్ కు గురైనవారు అప్రమత్తంగా ఉండాలని వివరిస్తున్నారు.
40 దాటితే పరీక్షలు అవసరం
ఆరోగ్యవంతులైనప్పటికీ 40 ఏళ్లు దాటినవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మహిళలలైతే మరింత ముందుగానే పరీక్షలకు వెళ్లాలని చెబుతున్నారు. సరైన జీవన విధానం పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉన్నవారికీ ఇదే విషయం వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉన్నవారు.. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటేనే మేలనేది ఆరోగ్య నిపుణుల సలహా.