తొలిదశలో లక్షణాలు కనిపించని వ్యాది... నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి ముప్పు!
ప్రారంభ దశలో గుర్తించి వైద్యం చేయించుకోకపోతే సమస్య తీవ్రమై ప్రాణాంతకంగా మారుతుంది
ప్రారంభ దశలో గుర్తించి వైద్యం చేయించుకోకపోతే సమస్య తీవ్రమై ప్రాణాంతకంగా మారుతుంది. కానీ తొలిదశలో లక్షణాలు ఏవీ బయటపడవు. ప్రస్తుతం ఈ వ్యాది చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రక్తమార్పిడి వంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం వంటివి మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అవును... తొలిదశలో లక్షణాలు కనిపించవనే పేరున్న హెపటైటిస్-సి... తెలంగాణలో వైద్య పరీక్షలు చేసిన దాదాపు ప్రతి 235 మందిలో ఒకరికి ఉన్నట్లుగా గుర్తించారు. తీవ్రమైన కాలేయ వ్యాధికి ఇది కారణమవుతోంది. ప్రస్తుతం ఈ వ్యాది వేగంగా విస్తరిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. 2022-23లో 1.64 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా 710 మందికి ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో వెల్లడించింది.
ఇన్ ఫెక్షన్ ఉన్న రక్తం ద్వారా ప్రధానంగా వ్యాపించే వ్యాధి ఇది. సరైన స్క్రీనింగ్ చేయకుండా రక్త మార్పిడి ఎంతో ప్రమాదం. సురక్షితమైన ఇంజక్షన్ విధానాలు లేకపోవడం, ఇతరులు ఉపయోగించిన వస్తువులు వాడటం ద్వారా కూడా వ్యాపించేందుకు అవకాశం ఉంది. మద్యం అలవాటు, ఊబకాయం వంటివి వ్యాధి తీవ్రతను పెంచుతాయి.
తొలిదశలో లక్షణాలు కనిపించనప్పటికీ... తీవ్రత పెరిగాక మాత్రం లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇందులో భాగంగా... జ్వరం, అలసట, రుచి కోల్పోవడం, కామెర్ల లక్షణాలు, కీళ్లనొప్పులు, ఆందోళన, ఆకలి మందగించడం, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మనదేశంలో లివర్ కి సంబంధించిన వ్యాదులతో మృతిచెందుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా లివర్ సిరోసిస్ ద్వారా అత్యధిక మరణాలు మనదేశంలోనే సంభవించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
కాలేయం పూర్తిగా దెబ్బతినడానికి ముందు స్టేజిని లివర్ సిరోసిస్ గా చూడొచ్చు. హెపటైటిస్ - సి ని నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్ ఇతర కాలేయం జబ్బులు తీవ్ర స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017వ సంవత్సరంలో సుమారుగా 2,20,000 మంది లివర్ సిరోసిస్, కాలేయ వ్యాధులతో మృతి చెందినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
ఇదే సమయంలో 2020 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు దేశవ్యాప్తంగా 5.82 కోట్ల మందిని స్క్రీనింగ్ చేయగా 1.74 లక్షల మంది తీవ్రమైన హెపటైటిస్ - బి, హెపటైటిస్ - సి వల్ల బాధపడుతున్నట్లు గుర్తించారు.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో హెపటైటిస్ - సి కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా... 2020-21లో 6,346 వైద్య పరీక్షలు చేయగా అందులో 24 కేసులు నిర్ధారణ అయ్యాయి. 2021-22లో 11,363 పరీక్షలకు గానూ 130 కేసులు నిర్ధారణ అవ్వగా... 2022-23లో 1,64,844 పరీక్షలు చేయగా వాటిలో 710 కేసులు నిర్ధారణ అయ్యాయి!