అవసరం లేకున్నా గర్భసంచి తొలగింపు.. ఏపీ, టీఎస్ లో ఎందుకు ఎక్కువ?

దేశంలో మహిళల్లో సుమారు 5 శాతం మంది గర్భసంచి తొలగింపు ఆపరేషన్స్ చేయించుకున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

Update: 2025-01-03 09:30 GMT

దేశంలో మహిళల్లో సుమారు 5 శాతం మంది గర్భసంచి తొలగింపు ఆపరేషన్స్ చేయించుకున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మహిళలు ఎక్కువగా ఉన్నారని చెబుతూ... అందుకు గల కారణాలు తెలిపింది. దీనికి సంబంధించిన సర్వేను అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాంతాల మహిళలపై చేశారు.

అవును... 2015-16 మధ్య జాతీయ కుటుంబ సర్వేలో 4.5 లక్షల మంది గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి నివేదిక విడుదల చేశారు. దీన్ని రూపొందించే పనిలో.. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, జాతీయ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు.

తాజాగా జర్నల్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్ లో ప్రచురితమైన ఈ నివేదిక వివరాల ప్రకారం... పాతికేళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న ప్రతీ 100 మంది మహిళల్లో ఐదుగురు మహిళలు గర్భసంచిని తొలగించుకున్నారని తేలింది. అయితే.. వీరిలో వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్న మహిళల సంఖ్య అత్యధికంగా (32 శాతం) ఉంది.

నెలసరి సమస్యలు, దాని చుట్టూ ఉన్న పలు అపనమ్మకాలు, అపోహలు, ఆరోగ్యంపై అశ్రద్ధతో పాటు వ్యవసాయ రంగంలో ఉన్న ఉపాధి అభద్రత మొదలైనవి ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. దీంతో పాటు నెలసరి నొప్పులను భరించలేక మరికొంతమంది మహిళలు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారని అంటున్నారు.

పైగా ఇటీవల గర్భసంచి క్యాన్సర్ వస్తుందేమో అనే భయంతో పాటు.. పిల్లలను కనిన తర్వాత గర్భసంచిని నిరూపయోగ అవయువంగా భావించడం కూడా మహిళలు ఈ నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతున్నాయని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.

ఈ గర్భసంచి తొలగింపు ఆపరేషన్ రేటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఇది ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఈ విషయంలో బీహార్ లో కూడా హిస్టరెక్టమీ రేటు పెరుగుతుందని అంటున్నారు. అవసరం లేకపోయినా ఈ రాష్ట్రాల్లో హిస్టరెక్టమీ పెరుగుతున్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో... రాజస్థాన్, బీహార్, ఛత్తిస్ గఢ్ రాష్ట్రాల్లో హిస్టరెక్టమీ రేటు పెరగడానికి కుటుంబ ఆదాయం తక్కువగా ఉండటం కారణమైతే... ఏపీ, తెలంగాణల్లో హెల్త్ ఇన్స్యూరెన్స్ పరిధి ఎక్కువగా ఉండటం ఒక కారణంగా తెలుస్తోందని అంటున్నారు. ఈ ఆపరేషన్లు ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News