మనిషికి పంది గుండె... 40 రోజుల్లో మృతి... అసలేమైంది?
ప్రపంచంలో జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి జనవరి, 2022లో మార్పిడి చేయగా... అతడు రెండు నెలల తర్వాత మరణించిన సంగతి తెలిసిందే.
మానవులకు అవయవాలు పాడైతే.. వేరే వాళ్లు దానం చేయడం.. వీలుకాకపోతే మరణించడం జరుగుతుంది. దీంతో... జంతువుల నుంచి సేకరించిన అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు వైద్యులు. ముఖ్యంగా పంది అవయవాల్లో జన్యుమార్పిడి చేసి మనుషులకు ఫిక్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో... ఇటీవల ఒక వ్యక్తికి పంది కిడ్నీని, మరొక వ్యక్తి పంది గుండెను అమర్చారు. అయితే ఇలా అమర్చిన కొత్తలో రోగులు బాగానే ఉంటున్నప్పటికీ... కాలక్రమేణా మానవ శరీర వ్యవస్థ ఆ జంతువుల అవయువాలను తిరస్కరించడంతో వారు మరణిస్తున్నారు. ఈ క్రమంలో పంది గుండె అమర్చుకున్న వ్యక్తి అలానే మరణించాడు.
అవును... అమెరికాలో పంది గుండె అమర్చిన వ్యక్తి మరొకరు కన్నుమూశారు. ప్రపంచంలో జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి జనవరి, 2022లో మార్పిడి చేయగా... అతడు రెండు నెలల తర్వాత మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా లారెన్స్ ఫౌసెట్(58) అనే వ్యక్తి కూడా ఇలాంటి సమస్యతోనే మరణించినట్లు తెలుస్తుంది. పంది గుండెను అమర్చిన 40 రోజుల తర్వాత ఆ గుండె వైఫల్యం చెందిందని చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చెందిన 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్ కు సెప్టెంబరు 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు. ఈ క్రమంలో ఆ గుండె అమర్చిన నెల రోజులపాటు అది బాగానే పనిచేసింది! అనంతరం... మెల్లమెల్లగా క్షీణించడం మొదలుపెట్టింది. దీంతో... 40 రోజుల తర్వాత ఆ గుండె ఆగిపోయింది.
ఈ విషయాలపై స్పందించిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసన్ వైద్యులు... ఆపరేషన్ పూర్తయిన తర్వాత లారెన్స్ ఫౌసెట్ ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు కనిపించిందని.. క్రమం తప్పకుండా ఫిజియో థెరపీలో పాల్గొన్నాడని.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవాడని.. ఈ సమయంలో భార్యతో కలిసి కార్డ్స్ కూడా ఆడేవాడని తెలిపారు.
ఈ క్రమంలో... ఇటీవలి రోజుల్లో అతడి గుండె వైఫల్య సంకేతాలను చూపించిందని.. దీంతో ఆయన కోసం వైద్య బృందం తీవ్రంగా శ్రమించిందని.. అయినప్పటికీ లారెన్స్ అక్టోబరు 30న తుది శ్వాస విడిచాడని.. ఆయనకు చికిత్స చేసిన ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో... అమెరికాలో పంది గుండె అమర్చుకుని మరణించిన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు!
ఈ సందర్భంగా... లారెన్స్ ఫౌసెట్ భార్య యాన్ కూడా స్పందించారు. ఇందులో భాగంగా... గతంలో నేవీలో పని చేసిన లారెన్స్ ఫౌసెట్.. "నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్"లో ల్యాబ్ టెక్నీషియన్ గా రిటైర్డ్ అయ్యాడని తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం గుండె మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ఈ సమయంలో... గుండె మార్పిడి కోసం అతను మేరీల్యాండ్ ఆస్పత్రికి వెళ్లారని అన్నారు. అయితే... అప్పటికే ఇతనికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో వైద్యులు మొదట్లో హార్ట్ ఆపరేషన్ కు నిరాకరించారని తెలిపారు. అయితే... చివరికి పంది గుండె అమర్చారని.. ఫలితంగా ఇన్నాళ్లు బతికాడని తెలిపారు.
కాగా... మానవులకు జంతువుల అవయవాలను అమర్చే ప్రక్రియను వైద్య పరిభాషలో "జెనో ట్రాన్స్‌ప్లాంటేషన్" అంటారు. అవయవ దాతలు అతి తక్కువగా అందుబాటులో ఉండటంతో శాస్త్రవేత్తలు ఈ ఈ మార్గాన్ని ఎంచుకొని ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు కొత్తగా అమర్చిన జంతువుల అవయవంపై మానవుల్లోని రోగ నిరోధకశక్తి కారకాలు దాడి చేయకుండా శాస్త్రవేత్తలు జన్యుపరమైన మార్పులు చేసి అమర్చుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రయోగాలు ఇంకా ఫలించడంలేదు.
ఈ నేపథ్యంలోనే గతేడాది జనవరిలో డేవిడ్ బెన్నెట్ .. తాజాగా లారెన్స్ ఫౌసెట్ లు మరణించారు. వీరిలో డెవిడ్ ఆపరేషన్ తర్వాత సుమారు రెండు నెలలు జీవించగా.. లారెన్స్ 40 రోజులకు మృతి చెందారు.