పిండంపై మెట్‌ఫార్మిన్ ఎఫెక్ట్.. గర్భిణులూ తస్మాత్ జాగ్రత్త!!
ప్రస్తుత పరిస్థితిలో అది ఫుడ్ కారణమో.. లేదంటే వంశ పారంపర్యం వల్లనో కానీ డయాబెటిస్ పేషెంట్లు నిత్యం పెరుగుతూనే ఉన్నారు.
ప్రస్తుత పరిస్థితిలో అది ఫుడ్ కారణమో.. లేదంటే వంశ పారంపర్యం వల్లనో కానీ డయాబెటిస్ పేషెంట్లు నిత్యం పెరుగుతూనే ఉన్నారు. అటు పని ఒత్తిడి వల్ల కావచ్చు.. మరే ఇతర కారణాలు కావచ్చు.. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో కనిపిస్తోంది. డయాబెటిస్ బారిన పడిన వారు నిత్యం పలు రకాల మందులు వాడుతున్నారు. అయితే.. ముఖ్యంగా గర్భిణులు వాటిని వాడడం వల్ల కొన్ని దుష్ఫరిణామాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
డయాబెటిస్ నియంత్రణకు డాక్టర్లు మెట్‌ఫార్మిన్ అనే ఔషధాన్ని ఇస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా జీవక్రియ రుగ్మతను దూరం చేయడానికి ఈ ఔషధాన్ని వినియోగిస్తుంటారు. మహిళలకు గర్భధారణ సమయంలో మధుమేహ సంబంధ కారణాల వల్ల కలిగే ముప్పు నుంచి కాపాడేందుకు వైద్యులు దీనిని సిఫారసు చేస్తుంటారు.
అయితే.. ఈ మెట్‌ఫార్మిన్ వాడడం వల్ల గర్భిణులకు ఇబ్బందులని అధ్యయనంలో వెల్లడైంది. దీనిని వాడడం వల్ల పిండం ఎదుగుదులను అడ్డుకుంటుందని వెల్లడిస్తున్నారు. కిడ్నీలు సహా ఇతర అవయవాలు ఎదగడంలో నెమ్మదిస్తుందని చెప్పుకొచ్చారు. అమెరికాలోని బెయిలర్ వైద్య కళాశాల పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనాన్ని అమెరికా జర్నల్ ఆఫ్ గైనకాలజీ అనే సంస్థ ప్రచురించింది.
గర్భం దాల్చిన 13 కోతులపై ఈ పరిశీధనకు దిగారు. గర్భం దాల్చిన 30 రోజులలోపు కోతులకు వాటి బరువు ఆధారంగా ఒక్కో కిలోకు 10 మిల్లీగ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు మెట్‌ఫార్మిన్‌ను ఇచ్చారు. 145వ రోజున వాటికి సిజేరియన్ చేసి.. మెట్‌ఫార్మిన్ ఔషధ స్థాయిలను గమనించారు. తల్లి గర్భం నుంచి గర్భస్థ శిశువుకు చెందిన మూత్రపిండాలు, కాలేయం, పేగులు, మాయ, ఉమ్మనీరు, మూత్రంలో కలుస్తున్నట్లు గుర్తించారు. వీటి వల్ల ఆయా అవయవాల ఎదుగుదలను నియంత్రిస్తుందని తేలినట్లు వారు వెల్లడించారు. మెట్‌ఫార్మిన్ వినియోగం పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలకు సైతం కారణం అవుతున్నట్లు నిర్ధారణ కాకపోయినా.. దాని అవశేషాలను బయటకు పంపించే మార్గం మాత్రం పిండానికి లేదని తేటతెల్లమైంది. అయితే.. దీనిపైనే మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లుగానూ పేర్కొన్నారు.