మరో మిస్టరీ వ్యాధి.. చిన్న పిల్లలుంటే జర భద్రం?

సరిగ్గా ఐదేళ్ల కిందట మొదలైంది కొవిడ్ వైరస్. అప్పట్లో మొదట ఎవరూ నమ్మలేదు. పైగా చైనాలో పుట్టిందని తెలియడంతో కొవిడ్ గురించి తొలుత నమ్మలేదు

Update: 2024-12-10 14:24 GMT

సరిగ్గా ఐదేళ్ల కిందట మొదలైంది కొవిడ్ వైరస్. అప్పట్లో మొదట ఎవరూ నమ్మలేదు. పైగా చైనాలో పుట్టిందని తెలియడంతో కొవిడ్ గురించి తొలుత నమ్మలేదు. దీనికితోడు ఈ రోజుల్లో ఎలాంటి వైరస్ ను అయినా తుంచేయగల మందులు ఉన్నందున ఎవరూ భయపడలేదు. కానీ, చివరకు ఏం జరిగింది..? కొవిడ్ మహమ్మారిగా మారింది. ప్రపంచాన్నే వణికించింది. దేశాలకు దేశాలు లాక్ డౌన్లు, షట్ డౌన్లు.. కోట్లలో మరణాలు.. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దాదాపు మూడేళ్లు వణికించిన కొవిడ్ భయం నుంచి బయటపడుతున్నారు.

ఆ వైరస్ ఎక్కడినుంచి..

ఇప్పటికీ కొవిడ్ వైరస్ పుట్టింది ఎక్కడనో తెలియదు. దీనిపై పరిశోధనకు చైనా మొదట అంగీకరించినా అనేక కొర్రీలు పెట్టింది. అసలు ఇప్పుడు కొవిడ్ ఊసే లేదు. అందుకని అది ఎక్కడ పుట్టిందో తెలిసినా చేసేదేం లేదు. కానీ, ఇంతలో మరో అంతుచిక్కని వ్యాధి పుట్టుకొచ్చింది.

కల్లోల కాంగోలో..

ఆఫ్రికా ఖండంలో కల్లోల దేశం కాంగో. ఇప్పటికే రెండుగా విడిపోయింది. అలాంటి దేశంలో మిస్టరీ వ్యాధి పెద్ద సమస్యగా మారింది. అక్టోబరు నుంచి దీని కారణంగా 143 మంది చనిపోయారు. ఇందులో ఐదేళ్ల లోపు పిల్లలే అధికంగా ఉన్నారట. పైగా ఈ మిస్టరీ వ్యాధి ఫ్లూ లక్షణాలతో వస్తున్నదట. అందుకే చిన్నారులు ప్రధానంగా ప్రభావితం అవుతున్నట్లు చెబుతున్నారు.

వ్యాప్తి ఎలానో?

ఏ వ్యాధికైనా పుట్టుక, వ్యాప్తి, లక్షణాలు తెలిస్తేనే అడ్డుకట్ట వేయగలం. కానీ, కాంగోలో వ్యాప్తి చెందుతున్న మిస్టరీ వ్యాధి ఆనుపానులు దొరకడం లేదు. అసలు ఎందుకు వస్తోంది, ఎలా వ్యాపిస్తోంది అనేది వైద్య నిపుణులకు అంతుచిక్కడం లేదట.

‘డిసీజ్ ఎక్స్..’

కరోనా వ్యాప్తి చెందిన సమయంలో ఈ వ్యాధికి ఏం పేరు పెట్టాలా? అని ఆలోచించారు. దీంతో 2019లో పుట్టింది కాబట్టి కొవిడ్ -19 అని నామకరణం చేశారు. కాంగో వ్యాదిని “డిసీజ్ ఎక్స్”గా వ్యవహరిస్తున్నారు. దీని కేసులు అత్యధికంగా క్వాంగో ప్రావిన్స్‌లో (406) నమోదయ్యాయి. కొందరు ఆసుపత్రికి చేరకుండానే చనిపోయారని భావిస్తున్నారు.

కాగా, దశాబ్దాల పాటు అంతర్యుద్ధంలో మగ్గిన కాంగో అంటేనే పేదరికం. అలాంటి దేశంలో పిల్లల్లో పౌష్టికాహార లోపం అధికం. అం దుకే వీరు వ్యాధుల బారిన పడుతున్నారు. మిస్టరీ వ్యాధిని అడ్డుకోవడం కాంగోకు అతిపెద్ద సవాలుగా మారిందట.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రత్యేక బృందాలను పంపింది. రోగుల నమూనాలను సేకరించింది. ప్రధాన లక్షణాలుగా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస ఇబ్బంది, రక్తహీనత కనిపిస్తున్నాయి. ప్రజల పేదరికం కారణంగా ఈ వ్యాధి మరింత తీవ్రంగా మారిందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News