వరల్డ్ హార్డ్ డే.. మన గుండెను కాపాడుకుందాం ఇలా!
ప్రస్తుతం ఎక్కడ చూసిన హాట్ టాపిక్ గా మారిన అంశం.. గుండెపోట్లు. ఒకప్పుడు 60 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే వృద్ధాప్యం రీత్యా గుండెపోట్లు వచ్చేవి.
ప్రస్తుతం ఎక్కడ చూసిన హాట్ టాపిక్ గా మారిన అంశం.. గుండెపోట్లు. ఒకప్పుడు 60 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే వృద్ధాప్యం రీత్యా గుండెపోట్లు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా 16 ఏళ్ల యువతీ యువకుల నుంచి అంతా దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ దుష్పలితాలతో గుండెపోట్లతో మరణించేవారు ఎక్కువయ్యారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న వరల్డ్ హార్డ్ డే సందర్భంగా మన గుండెను కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు, అసలు వ్యాయామం చేయనివారు, నిద్రలేమితో బాధపడేవారు గుండె జబ్బులకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
సంతులిత ఆహారాన్ని తీసుకోకపోవడం, అనవసరమైన ఒత్తిడి కూడా గుండెపోట్లకు కారణాలవుతున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు చాలా చిన్న వయసులోనే గుండెపోట్లతో అకాల మృత్యువు పాలడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం ఏటా సెప్టంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గుండె జబ్బులు రావడానికి కారణాలు, రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితరాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ‘యూజ్ హార్ట్.. నౌ హార్ట్’ అనే నినాదంతో మరింతగా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.
ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గుండె జబ్బులు ఇప్పుడు గ్రామాలకూ ఎగబాకాయి. ప్రస్తుతం ప్రతి పది మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు ఇండియన్ కార్డియాలజీ సొసైటీ ఇటీవల హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని సూచించింది.
ధూమపానం, మద్యపానం అధికంగా తీసుకోవడం, అధిక రక్తపోటు, దాన్ని నియంత్రించుకోలేకపోవడం, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, వయసుకు, ఎత్తుకు మించిన బరువును కలిగి ఉండటం, శరీరంలో ఉండాల్సిన దానికంటే ట్రైగ్లిజరాయిడ్స్ శాతం ఎక్కువ ఉండటం, జన్యుపరంగా, కుటుంబ చరిత్ర పరంగా గుండె జబ్బులు ఉండటం వంటివి గుండె వ్యాధులకు కారణాలుగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె జబ్బులను నివారించాలంటే రోజూ 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి మేలు చేస్తాయని అంటున్నారు. అలాగే ధూమపానం, మద్యపానంలకు పూర్తి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కొవ్వులున్న ఆహారానికి పూర్తి దూరంగా ఉండాలని చెబుతున్నారు. రెడ్ మీట్ ను వీలైనంత తక్కువ తినాలంటున్నారు. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడంతోపాటు కనీసం ఆరు నెలలకోసారి 2డీ ఎకో వంటివి చేయించుకోవడం మంచిదంటున్నారు. చెడు కొలెస్ట్రాల్ ను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు తరచూ రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. పదే పదే మరిగించిన నూనెతో చేసినవి తింటే గుండెకు ఎక్కువ ముప్పు ఉంటుందని.. అలాంటి వాటికి దూరంగా ఉండాలంటున్నారు.