బెంగళూరు కంటే హైదరాబాదే ముద్దు.. ఐటీ ఉద్యోగుల తీరుపై కొత్త అధ్యయనం
ఐటీ అన్నంతనే బెంగళూరు వైపు మొగ్గు చూపే వారు సైతం ఇప్పుడు హైదరాబాదే ఫస్ట్ అంటున్నట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది.
తాజాగా బయటకు వచ్చిన అధ్యయనం ఆసక్తికరంగా మారింది. ఐటీ ఉద్యోగులు అమితాసక్తి చూపే నగరంగా హైదరాబాద్ మారుతోంది. ఐటీ అన్నంతనే బెంగళూరు వైపు మొగ్గు చూపే వారు సైతం ఇప్పుడు హైదరాబాదే ఫస్ట్ అంటున్నట్లుగా తాజా అధ్యయనం వెల్లడించింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగవకాశాలు తగ్గినప్పటికీ.. హైదరాబాద్ లో మాత్రం బాగున్నట్లుగా ఈ రిపోర్టు వెల్లడించింది.
ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ ఉద్యోగ నియామకాలు.. జాబ్ క్లిక్ లపై అధ్యయనాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా కీలక అంశాల్ని ప్రస్తావించింది. అందులోని ముఖ్యాంశాల్ని చూస్తే..
- ఖర్చుల తగ్గింపు.. మాంద్యం పరిస్థితుల్లో ఐటీ సంస్థల్లో నియామకాలు తగ్గిపోయాయి. క్యాంపస్ ప్లేస్ మెంట్లు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ఐటీ రంగం మాత్రం రికార్డు స్థాయిలో ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
- ఐటీకి ప్రధాన కేంద్రాలుగా పేర్కొనే బెంగళూరు.. హైదరాబాద్ లో పురోగతి నెలకొంది.
- హైదరాబాద్ ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాల పెరుగుదల 24 శాతంగా ఉంది.
- ఐటీ ఉద్యోగ అవకాశాలు ఉన్న నగరంగానే కాదు.. ఐటీ ఉద్యోగుల ప్రాధాన్యత కూడా హైదరాబాద్ కే ఉంది.
- హైదరాబాద్ లో స్థిరాస్తి.. కనీస మౌలిక సదుపాయాలు.. ట్రాఫిక్ తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకొంటున్న ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
- ఐటీ జాబ్ కోసం వెతికే వారిలో హైదరాబాద్ తమ మొదటి ప్రాధాన్యత అంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే 161 శాతం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
- ఇదే అంశంలో బెంగళూరులో 80 శాతం వ్రద్ధి రేటు కనిపించింది.
- దేశ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగ అవకాశాల తగ్గుదల 3.6 శాతం ఉంది. అయినప్పటికీ హైదరాబాద్.. బెంగళూరు మహానగరాలు తమ ప్రాధాన్యతగా ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. అందునా హైదరాబాద్ కు తమ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తాజా అధ్యయనం స్పష్టం చేసింది.